ఎలాంటి సినిమా బ్యాక్ గ్రౌండ్ లేకుండా సినీ పరిశ్రమలోకి వచ్చి తనకంటూ ఒక ప్రత్యేకమైన మార్క్ క్రియేట్ చేసుకున్నాడు. రాంగోపాల్ వర్మ శిష్యుడిగా సినీ రంగ ప్రవేశం చేసి ఇప్పుడు ఎంతోమంది డైరెక్టర్లు సినీ రంగానికి పరిచయం అయ్యేందుకు ఆయన ఒక స్ఫూర్తిగా నిలుస్తున్నాడు. చివరిగా ఇస్మార్ట్ శంకర్ సినిమాతో హిట్ అందుకున్న ఆయన తర్వాత లైగర్ అనే సినిమాతో ఫ్లాప్ అందుకున్నాడు. ప్రస్తుతానికి మళ్ళీ రామ్ పోతినేనితోనే డబల్ ఇస్మార్ట్ అనే సినిమా చేస్తున్నాడు. ఇక పూరీ జగన్నాథ్ గురించి ఆయన తల్లి అమ్మాజీ తాజాగా ఒక ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తన కుమారుడు పడ్డ కష్టం ఎవరూ పడకూడదని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు.
డిగ్రీ పూర్తయిన తర్వాత సినిమా పిచ్చితో హైదరాబాద్ వచ్చి ఆఫీసుల చుట్టూ తిరిగేవాడని ఆమె పేర్కొన్నారు. ఏడో తరగతి చదువుతున్నప్పుడు నుంచి సినిమాలంటే పిచ్చి ఏర్పడిందని ఆమె పేర్కొన్నారు. అయితే పూరి జగన్నాథ్ దర్శకుడు కాకముందు ఒకసారి హైదరాబాద్ వెళ్తే అప్పుడు ఆయన కాళ్లు బాగా వాచిపోయి ఉన్నాయని సాక్సులు వేసుకోవడానికి కూడా కుదరడం లేదని ఆ పరిస్థితి చూసి తనకి ఏడుపొచ్చి ఏడ్చేసానని అన్నారు. ఇంత కష్టం పడటం ఎందుకు? ఊరు వచ్చేస్తే పొలం పని చేసుకుని బతుకుదాం కదా అంటే తాను రానని చెప్పాడని ఆమె పేర్కొన్నారు. జగన్ అన్నం కూడా తినకుండా మంచి నీళ్లు తాగిన సందర్భాలు కూడా ఎన్నో ఉన్నాయని ఆమె వెల్లడించారు.
ఇక పూరి జగన్నాథ్ డైరెక్టర్ అయిన తర్వాత ఆయన దగ్గర పనిచేసే కుర్రాడు ఒకడు నమ్మించి 80 కోట్లు కొట్టేసాడని ఆమె పేర్కొన్నారు. ఆ తర్వాత ఒక సినిమా వలన భారీగా నష్టం ఏర్పడడంతో కుటుంబం అంతా రోడ్డు మీదకు వచ్చేయాల్సిన పరిస్థితి ఏర్పడినట్లు ఆమె వెల్లడించారు. ఆ సమయంలో పూరీ జగన్నాథ్ కొనుక్కున్న ఐదు ఇళ్ళు అమ్మేశాడని పేర్కొన్నారు. మోసం చేసినవాడు ఎవరో తెలుసు, వాడి కాళ్లు విరిచేద్దామా అని స్నేహితుడు ఒకరు అంటే వద్దని వాడికి ఏ జన్మలోనా మనం రుణపడి ఉన్నాం కాబట్టి ఇలా జరిగింది అని సైలెంట్ అయ్యాడని అన్నారు. ఒంట్లో సత్తువ ఉన్నంతవరకు కష్టపడతానని ఈ విషయం ఇక్కడితో వదిలేయాలని పూరి జగన్నాథ్ పేర్కొన్నాడని అమ్మాజీ చెప్పుకొచ్చారు.