Hanuman : ఈ సంక్రాంతికి ప్రేక్షకుల్లో మంచి అంచనాలను ఏర్పాటు చేసిన చిత్రాలలో ఒకటి ‘హనుమాన్’. చిన్న ఆర్టిస్టులతో, చిన్న బడ్జెట్ తోనే అద్భుతమైన సృజనాత్మకత తో రూపొందించిన ఈ సినిమా కోసం కేవలం తెలుగు ఆడియన్స్ మాత్రమే కాదు, హిందీ ఆడియన్స్ కూడా ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. జనవరి 12 వ తారీఖున విడుదల అవ్వబోతున్న ఈ సినిమాతో పాటుగా సూపర్ స్టార్ మహేష్ బాబు ‘గుంటూరు కారం’ చిత్రం కూడా విడుదల అవుతుంది.
సోషల్ మీడియా లో అయితే ‘హనుమాన్’ చిత్రం ‘గుంటూరు కారం’ సినిమాని కూడా డామినేట్ చేసేస్తుంది. బుక్ మై షో మరియు యూట్యూబ్ వంటి మాధ్యమాలలో ఆడియన్స్ ‘గుంటూరు కారం’ చిత్రానికే ఎక్కువ ఓట్లు గుద్దుతున్నారు. ఇది ఇలా ఉండగా ఈ సినిమాకి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ ని నిన్న హైదరాబాద్ లో ఏర్పాటు చేసారు. ఈ ఈవెంట్ కి మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా విచ్చేశాడు.
ఆయన ఈ సినిమా గురించి మాట్లాడుతూ ‘నేను ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి రావడానికి ముఖ్య కారణం బహుశా తేజానే, కానీ అంతకంటే ముఖ్యమైన కారణం, నా ఆరాధ్య దైవం ‘హనుమాన్’ కి సంబంధించిన సినిమా కావడం. ఈ సినిమా ట్రైలర్ ని చూసి నేను ఆశ్చర్యపోయాను. ఎవరు ఈ చిత్రానికి డైరెక్టర్ అని అడిగి తెలుసుకొని ప్రశాంత్ వర్మ కి ఫోన్ చేసి అభినందించాను. కొద్దిరోజుల క్రితమే ప్రశాంత్, తేజా ఇద్దరు కలిసి నా దగ్గరకి వచ్చారు. ఇలా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి రావాల్సిందిగా ఆహ్వానించారు. నిమిషం కూడా ఆలోచించకుండా ఓకే చెప్పేసాను’ అంటూ చెప్పుకొచ్చాడు.
ఇది ఇలా ఉండగా ‘గుంటూరు కారం’ చిత్రం కారణం గా నైజాం ప్రాంతం లో ‘హనుమాన్’ సినిమాకి థియేటర్స్ దక్కనివ్వకుండా చేస్తున్నారని, గత కొద్దిరోజులు గా ఆ సినిమా నైజాం ప్రాంతం బయ్యర్ దిల్ రాజు పై చాలా తీవ్రమైన వ్యతిరేకత సోషల్ మీడియా లో ఎదురు అవుతున్న సంగతి తెలిసిందే. దీనిపై చిరంజీవి మాట్లాడుతూ ‘కొంతమంది ఈ సినిమాకి థియేటర్స్ ని దక్కనివ్వకుండా చేస్తున్నారని అంటున్నారు. సినిమా కంటెంట్ బాగుంటే, ఎవ్వరైనా థియేటర్స్ ని ఆపి ఉంచలేరు. దాని అంతటా అవే వస్తాయి, హనుమాన్ సినిమాకి కూడా థియేటర్స్ దక్కుతాయి చూడండి’ అంటూ చిరంజీవి చెప్పుకొచ్చాడు.