Naa Saami Ranga : సంక్రాంతి కి అత్యధిక సూపర్ హిట్స్ కొట్టిన హీరోల లిస్ట్ తీస్తే అందులో నాగార్జున కచ్చితంగా ఉంటాడు. ఈయన కెరీర్ లో హైయెస్ట్ వసూళ్లను రాబట్టిన ‘సోగ్గాడే చిన్నినాయన’ చిత్రం సంక్రాంతికి వచ్చిందే. అప్పట్లో ఎన్టీఆర్ ‘నాన్నకు ప్రేమతో’ మరియు బాలయ్య ‘డిక్టేటర్’ చిత్రాలతో పోటీ పడిన ఈ చిత్రం, ఆ రెండు సినిమాల కంటే ఎక్కువ వసూళ్లను రాబట్టింది. అలాగే అక్కినేని ఫ్యామిలీ స్లంప్ ఫేస్ లో ఉన్నప్పుడు వచ్చిన సూపర్ హిట్ ‘బంగార్రాజు’ చిత్రం కూడా సంక్రాంతికి వచ్చిందే.

అందుకే ‘నా సామి రంగ’ స్క్రిప్ట్ నాగార్జున వద్దకి వచ్చినప్పుడు, ఈ సినిమాని సంక్రాంతికి విడుదల చేస్తాను అంటేనే చేస్తా అనే కండిషన్ పెట్టాడట నిర్మాతకి. ఇచ్చిన మాట ప్రకారమే ఈ సినిమాని సంక్రాంతి కానుకగా జనవరి 14 వ తేదీన విడుదల చెయ్యబోతున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుండి వచ్చిన ప్రమోషనల్ కంటెంట్ ఫ్యాన్స్ మరియు ఆడియన్స్ ని ఆకట్టుకుంది.

ఇదంతా పక్కన పెడితే ఇటీవల కాలం లో నాగార్జున సినిమాకి ఈ రేంజ్ బిజినెస్ ఎప్పుడు జరగలేదట. కేవలం డిజిటల్ రైట్స్ తోనే ఈ సినిమాకి పెట్టిన బడ్జెట్ కి రెండింతల లాభం వచ్చిందట. ఈమధ్య కాలం లో పెద్ద సినిమాలకు సైతం డిజిటల్ రైట్స్ భారీ పెట్టి కొనేందుకు ఆసక్తి చూపించడం లేదు ఓటీటీ సంస్థలు. అలాంటి సమయం లో నాగార్జున ‘నా సామి రంగ’ డిజిటల్ రైట్స్ ని 21 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసారు అనేది చిన్న విషయం కాదు.

డిస్నీ + హాట్ స్టార్ సంస్థ ఈ చిత్రం డిజిటల్ రైట్స్ ని కొనుగోలు చేసిందట. సాటిలైట్ రైట్స్ కూడా ఘనంగానే జరిగాయట. ఇక ప్రపంచవ్యాప్తంగా థియేట్రికల్ రైట్స్ దాదాపుగా పాతిక కోట్ల రూపాయలకు జరిగినట్టు సమాచారం. నాగార్జున సినిమాకి థియేట్రికల్ + నాన్ థియేట్రికల్ ఇంత బిజినెస్ జరగడం ఇదే తొలిసారి అంటున్నారు ట్రేడ్ పండితులు.
