Kajal Agarwal : చందమామ అని ముద్దుగా పిలుచుకునే హీరోయిన్ కాజల్ అగర్వాల్. కమర్షియల్ సినిమాల్లో క్యారెక్టర్లు చేశారామె. అలాగే, అభినయానికి ఆస్కారం ఉన్న పాత్రలు కూడా చేశారు. కానీ, ఇప్పుడు ఆవిడ రూట్ మార్చినట్లు అర్థం అవుతోంది. యాక్షన్, ఫిమేల్ ఓరియెంటెడ్ రోల్స్ చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. కాజల్ ప్రధాన పాత్రలో రూపొందుతున్న తాజా సినిమా ‘సత్యభామ’. ఆమెకు జోడీగా యువ హీరో నవీన్ చంద్ర నటిస్తున్నారు.

సుమన్ చిక్కాల దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాతో దర్శకుడు శశికిరణ్ తిక్క చిత్ర నిర్మాణంలో అడుగు పెట్టారు. అడివి శేష్ హీరోగా నటించిన ‘మేజర్’, ‘గూఢచారి’ సినిమాలతో ఆయన దర్శకుడిగా మంచి పేరు తెచ్చుకున్నారు. ‘సత్యభామ’కు ఆయన సమర్పకులు. అంతే కాదు… స్క్రీన్ ప్లే అందించారు. అవురమ్ ఆర్ట్స్ పతాకంపై బాబీ తిక్క, శ్రీనివాసరావు తక్కలపల్లి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

లేటెస్ట్ అప్డేట్ తెలిసి ఆశ్చర్యపోతున్నారు. ‘సత్యభామ’ షూటింగ్ కొన్ని రోజుల ముందు మొదలైంది. నవంబర్, డిసెంబర్ నెలలో శరవేగంగా చిత్రీకరణ జరిగింది. ”35 రోజుల పాటు సాగిన షెడ్యూల్‌తో 90 శాతం సినిమా పూర్తి చేశాం. కాజల్ అగర్వాల్, ఇతర ఆర్టిస్టులు పాల్గొనగా… ఫైట్ మాస్టర్ సుబ్బు ఆధ్వర్యంలో భారీ యాక్షన్ సీన్లు తెరకెక్కించాం. కాజల్ ఎప్పుడూ కనిపించని యాక్షన్ అవతార్‌లో ‘సత్యభామ’ సినిమాలో కనిపిస్తారు. కాజల్ ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఎంతో శ్రమించి ఈ యాక్షన్ సీక్వెన్సులు కంప్లీట్ చేశారు. బ్యాలెన్స్ షూటింగ్ కంప్లీట్ చేసి త్వరలోనే రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తాం” అని అన్నారు.