నటీనటులు : రోషన్ కనకాల, మానస చౌదరి, చైతన్య జొన్నలగడ్డ, హర్షవర్ధన్, వైవా హర్ష తదితరులు.
దర్శకత్వం : రవికాంత్ పేరెపు
సంగీతం : శ్రీచరణ్ పాకాల
బ్యానర్ : పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ , మహేశ్వరీ మూవీస్
Bubble Gum : యాంకరింగ్ రంగం లో రెండు దశాబ్దాల నుండి పోటీ అనేదే లేకుండా దూసుకుపోతున్న సుమ, సినిమాల్లో క్యారక్టర్ ఆర్టిస్టుగా క్షణం తీరిక లేకుండా గడుపుతున్న బిజీ ఆర్టిస్ట్ రాజీవ్ కనకాల కి పుట్టిన రోషన్ కనకాల ఇప్పుడు ‘బబుల్ గమ్’ అనే సినిమా ద్వారా మన ముందుకొచ్చిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ సినిమా ప్రొమోషన్స్ సమయం లో రోషన్ ని చూసిన ఆడియన్స్ , ఇతను పెద్దగా అందంగా లేడు కానీ, పర్లేదు టాలెంట్ ఉన్నట్టు ఉంది అని అనుకున్నారు. నేడు ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదలైన ఈ సినిమా ని చూసిన తర్వాత కూడా ఆడియన్స్ లో అదే ఫీలింగ్ ఉందా లేదా అనేది ఇప్పుడు మనం ఈ రివ్యూ లో చూడబోతున్నాం.
కథ :
ఆది అలియాస్ ఆదిత్య (రోషన్ కనకాల) హైదరాబాద్ లో ఒక మధ్య తరగతి కుటుంబానికి సంబంధించిన కుర్రాడు. అతనికి తన జీవితం లో పెద్ద డీజే అవ్వాలి అనేది అతని కోరిక. అనుకోకుండా ఒకరోజు పార్టీలో జాన్వీ (మానస చౌదరి) అనే అమ్మాయిని చూసి ప్రేమలో పడుతాడు. ఆ అమ్మాయి మంచి రిచ్ కిడ్. ప్రేమ, పెళ్లి , ఎమోషన్స్ వంటి వాటికి దూరంగా ఉంటుంది. కానీ ఆది డీజే టాలెంట్ మరియు అతని వ్యక్తివం చూసి ప్రేమలో పడుతుంది. అలా వీళ్లిద్దరి లవ్ స్టోరీ ముందుకు సాగుతున్న సమయం లో ఒక పార్టీలో జాన్వీ స్నేహితురాలు చేసిన ఒక తొందరపాటు పని వల్ల ఆది మరియు జాన్వీ మధ్య పెద్ద గొడవ జరుగుతుంది. ఈ గొడవలో ఆదిని చాలా ఘోరంగా అవమానిస్తుంది జాన్వీ. ఆ అవమానం ని ఆది ఎలా తీసుకున్నాడు..? , రెండు భిన్నమైన మనస్తత్వాలు ఉన్న ఈ ఇద్దరు చివరికి కలుస్తారా లేదా ?, ఆది తన జీవిత లక్ష్యం డీజే అవ్వాలనే కోరికని నెరవేర్చుకున్నాడా లేదా అనేది మిగిలిన స్టోరీ.
విశ్లేషణ :
ఈ చిత్రం పూర్తిగా నేటి తరం యూత్ ని టార్గెట్ గా తీసుకొని తెరకెక్కించాడు డైరెక్టర్ రవికాంత్. సినిమాలోని ఫస్ట్ హాఫ్ మొత్తం హీరో నేపథ్యం, అతని కుటుంబ సభ్యులు మరియు స్నేహితుల పాత్రలను ఎస్టాబ్లిష్ చెయ్యడానికే సమయం తీసుకున్నాడు డైరెక్టర్. హీరో హీరోయిన్ మధ్య వచ్చే లవ్ సీన్స్ చాలా రొటీన్ గా అనిపించినా, టైం పాస్ అయ్యేటట్టుగానే ఉంటుంది. సినిమా ఫస్ట్ హాఫ్ లో హీరో కుటుంబాన్ని చూసినప్పుడు మనకి డీజే టిల్లు చిత్రం గుర్తుకు వస్తుంది. ఆ ఛాయలు ఈ చిత్రం లో కనిపిస్తాయి. కానీ ఇంటర్వెల్ సన్నివేశం మాత్రం కాస్త డిఫరెంట్ గా, సెకండ్ హాఫ్ మీద ఆసక్తి పెంచేలా చేస్తుంది. ప్రేయసి చేత ఘోరంగా అవమానించబడ్డ ప్రియుడు కసితో పెద్ద డీజే ఎలా అయ్యాడు అనే అంశాన్ని డైరెక్టర్ చాలా చక్కగా చూపించాడు. ఫస్ట్ హాఫ్ మొత్తం హీరోయిన్ గ్లామర్ రోల్ కి పరిమితం అయితే, సెకండ్ హాఫ్ మొత్తం నటనకి ప్రాధాన్యత ఉన్న పాత్రలాగా ఆమె క్యారక్టర్ మారిపోతుంది.
తన తప్పుని తెలుసుకొని హీరో మనసుని గెలుచుకోవడానికి హీరోయిన్ పడే తాపత్రయం, అందుకోసం ఆమె హీరో ఇంటికి రావడం వంటి సన్నివేశాలు పర్వాలేదు అనిపించాయి. ఒక్క మాటలో చెప్పాలంటే సెకండ్ హాఫ్ మొత్తం హీరోయిన్ పాత్ర నడిపించింది అన్నట్టుగా చూసే ఆడియన్స్ కి అనిపిస్తాది. ఇక హీరో కి తండ్రి క్యారక్టర్ కి మధ్య వచ్చే భావోద్వేగ సన్నివేశాలు బాగా పండాయి. ఇక రోషన్ నటన విషయానికి వస్తే, మొదటి సినిమానే అయ్యినప్పటికీ, ఎమోషన్ సన్నివేశాల్లో చాలా చక్కగా నటించాడు. ఇతనిలో టాలెంట్ ఉంది, కచ్చితంగా పైకి వస్తాడు. ఇక హీరోయిన్ మానస చౌదరి ఒక పక్క తన అందం తో, మరోపక్క తన నటన తో ఆడియన్స్ మనసుల్ని గెలుచుకుంది. ఈమెకి కూడా మంచి భవిష్యత్తు ఉంది అనడం లో ఎలాంటి సందేహం లేదు. ఓవరాల్ గా బబుల్ గమ్ టైటిల్ కి తగ్గట్టుగానే ఫస్ట్ హాఫ్ మొత్తం సాగదీసినట్టు అనిపించినా, సెకండ్ హాఫ్ మాత్రం తియ్యగా బాగుంది అన్నట్టుగానే ప్రతీ ప్రేక్షకుడికి అనిపిస్తుంది.
చివరిమాట :
వీకెండ్ లో స్నేహితులతో కలిసి థియేటర్స్ లో చూసి మంచిగా ఎంజాయ్ చేయదగ్గ చిత్రం.
రేటింగ్ : 2.75/5