Venkatesh : తెలుగు చలన చిత్ర పరిశ్రమలో సీనియర్ హీరోలలో విక్టరీ వెంకటేష్ తనకంటూ ఏర్పాటు చేసుకున్న ఇమేజి మామూలుది కాదు. ప్రముఖ నిర్మాత రామానాయుడు కొడుకుగానే ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టాడు కానీ, స్టార్ స్టేటస్ సొంతంగా వెంకటేష్ సంపాదించుకున్నాడు. కామెడీ, యాక్షన్ , సెంటిమెంట్ , ఫ్యామిలీ డ్రామా ఇలా ఏ జానర్ తీసుకున్న విక్టరీ వెంకటేష్ అల్లాడించేస్తాడు.
సీనియర్ హీరోలలో అత్యధిక సూపర్ హిట్ సినిమాలు ఉన్న హీరో కూడా ఆయనే. అందుకే ఆయనకీ విక్టరీ అనే పేరు పెట్టారు. ‘కలియుగ పాండవులు’ సినిమాతో ప్రారంభమైన వెంకటేష్ కెరీర్ నేడు ‘సైన్డవ్’ వరకు కొనసాగింది. ‘సైన్డవ్’ 75 వ చిత్రం కాబట్టి ఆ చిత్ర నిర్మాణ సంస్థ ‘నిహారిక ఎంటర్టైన్మెంట్స్’ నిన్న పెద్ద ఎత్తున ఈవెంట్ ని ఏర్పాటు చేసింది. ఈ ఈవెంట్ కి మెగాస్టార్ చిరంజీవి, నాని వంటి వారితో పాటు పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు.
ఈ ఈవెంట్ కి మహేష్ బాబు మరియు అక్కినేని నాగార్జున కూడా రావాల్సింది కానీ, వాళ్ళిద్దరికీ రాత్రి వరకు షూటింగ్ జరుగుతూ ఉండడం వల్ల ఈ ఈవెంట్ కి రాలేకపోయారు. ఇకపోతే ఈ ఈవెంట్ లో వెంకటేష్ మాట్లాడిన కొన్ని మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది.
ఆయన మాట్లాడుతూ ‘ నాకు ఆధ్యాత్మికత విలువలు ఎక్కువ..సినిమాల మీద ఒక్కోసారి నాకు విరక్తి కలిగేది. అన్నీ వదిలేసి హిమాలయాలకు వెళ్లి ధ్యానం చేసుకుంటూ ఉండాలని అనుకున్నాను. కానీ నన్ను అలా వెళ్లనివ్వకుండా చేసింది మెగాస్టార్ చిరంజీవి గారు. ఎందుకంటే 9 ఏళ్ళ విరామం తీసుకొని, మళ్ళీ ఆయన ఖైదీ నెంబర్ 150 తో రీ ఎంట్రీ ఇచ్చి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు. అది చూసిన తర్వాత నాకు, సినిమాలు చివరి శ్వాస వరకు చెయ్యాలని అనిపించింది. నా తోటి హీరోలు చిరంజీవి, నాగార్జున మరియు బాలయ్య ని చూస్తే నాలో ఎనర్జీ పెరుగుతూ ఉంటుంది’ అని వెంకటేష్ చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది.