Hero Vidyut : నటుడు విద్యుత్ జమ్వాల్ గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. హిందీతో పాటు తెలుగులోనూ పలు సినిమాల్లో నటించారు. ‘శక్తి’, ‘ఊసరవెల్లి’, ‘తుపాకి’ సినిమాలతో టాలీవుడ్ ప్రేక్షకులను అలరించారు. బాలీవుడ్ మూవీస్ లో తమ మార్క్ యాక్షన్ తో అందరినీ ఆకట్టుకున్నారు. దేశ వ్యాప్తంగా యాక్షన్ మూవీ ప్రియులకు దగ్గరయ్యారు. ప్రస్తుతం ఆయన రెండు సినిమాల్లో నటిస్తున్నారు. వాటిలో ఒకటి ‘షేర్ సింగ్ రాణా’ కాగా, మరొకటి ‘క్రాక్’ మూవీ. ఈ రెండు సినిమాలు యాక్షన్ థ్రిల్లర్స్ గా రూపొందుతున్నాయి. ఇప్పటికే ఈ చిత్రాలపై భారీగా అంచనాలు ఏర్పడ్డాయి. ‘క్రాక్’ సినిమాలో సీబీఐ డీసీపీ అర్జున్ సింధియాగా కనిపించబోతున్నారు.

ఈ సినిమాకు తనే నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ మూవీ 2024 ఫిబ్రవరి 23న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ దాదాపు పూర్తి కావచ్చింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు కొనసాగుతున్నాయి. ప్యాచ్ వర్క్ కూడా నడుస్తోంది. ప్రస్తుతం సినిమా షూటింగ్స్ నుంచి విద్యుత్ జమ్వాల్ కు కాస్త విరామం లభించింది. ఈ నేపథ్యంలో ఆయన హిమాలయాలకు వెళ్లారు. అక్కడ ఒంటరిగా విహరిస్తున్నారు. తాజాగా తన హిమాలయ పర్యటనకు సంబంధించి ఫోటోలను ఆయన సోషల్ మీడియా ద్వారా షేర్ చేశారు.

ఈ ఫోటోలు చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు. ఒంటిపై దుస్తులు లేకుండా కనిపించడంతో ఆశ్చర్యపోతున్నారు. హిమాలయ వనాల్లో ప్రపంచంతో సంబంధం లేకుండా జీవితాన్ని గడుపుతూ కనిపించారు. అతి సాధారణ వ్యక్తి మాదిరిగా తన కోసం వంట చేసుకుంటున్నారు. ఈ ఫోటోల్లో తను ఓ యోగిలా దర్శనం ఇచ్చారు. పారుతున్న నీళ్లలోకి దిగి సూర్య నమస్కారాలు చేయడం, చెట్ల కర్రలతో వంట చేయడం ఈ ఫోటోల్లో కనిపిస్తోంది.