Animal : ‘యానిమల్’ చిత్రాన్ని ఉద్దేశిస్తూ ఆసక్తికర పోస్ట్ పెట్టారు నటి రష్మిక. తమ చిత్రాన్ని ఆదరిస్తోన్న ప్రేక్షకులకు ధన్యవాదాలు చెప్పారు. ఇందులో తాను పోషించిన గీతాంజలి పాత్ర చిత్రీకరణ గురించి పలు విశేషాలు పంచుకున్నారు. కుటుంబం మొత్తం కలిసి ఉండేలా చేసిన శక్తి గీతాంజలి అని ఆమె అన్నారు. ‘‘గీతాంజలి.. నేను గనక ఈ పాత్రను ఒక్క మాటలో వర్ణించాలనుకుంటే.. కుటుంబం మొత్తం కలిసి ఉండేలా చేసిన శక్తి ఆమేనని చెబుతా. తన మనసు ఎంతో స్వచ్ఛమైనది. అలాగే, ఆమె ధైర్యవంతురాలు కూడా. గీతాంజలి ఎందుకలా ప్రవర్తిస్తుందంటూ ఒక నటిగా ఎన్నో సందర్భాల్లో దర్శకుడిని ప్రశ్నించా.
నా ప్రశ్నలకు సందీప్ వంగా చెప్పిన సమాధానం నాకింకా గుర్తుంది. ఇది రణ్‌విజయ్ – గీతాంజలిల కథ. వాళ్ల ప్రేమ.. కుటుంబం.. జీవితం.. అలాగే ఇదే వాళ్ల స్వభావం. హింస, బాధతో నిండిన ప్రపంచంలో శాంతి, నమ్మకం, ప్రశాంతతను గీతాంజలి తీసుకువచ్చింది. భర్త, పిల్లలు ఎప్పుడూ సురక్షితంగా ఉండాలంటూ భగవంతుడిని కోరుకునేది. కుటుంబం కోసం తన శక్తి మేరకు ఎన్నో ఒడిదొడుకులను తట్టుకుని నిలబడిన శిల ఆమె. నా కళ్లతో చూస్తే.. గీతాంజలి ఎంతో అందమైన అమ్మాయి. తన కుటుంబాన్ని సంరక్షించుకోవడం కోసం ధైర్యంగా నిలబడే ఎంతోమంది మహిళల్లాంటిదే ఆమె కూడా.
‘యానిమల్’ విడుదలైన రోజు నుంచి ఎన్నో ప్రశంసలు వస్తున్నాయి. మీ అందరి ప్రేమాభిమానాలు చూస్తుంటే వర్ణించలేనంత ఆనందంగా ఉంది. ఒక నటిగా నాకు గీతాంజలి పాత్ర ఎంతో నచ్చింది. గీతాంజలి ధైర్యం నిజంగా ప్రశంసనీయం. ఆ పాత్రలో నటించిన ప్రతి సన్నివేశాన్నీ నేను ఎంజాయ్ చేశా. ఈ సినిమా షూటింగ్‌లో చిత్రబృందంతో గడిపిన క్షణాలు ఎప్పటికీ గుర్తుంటాయి’’ అంటూ చెప్పుకొచ్చారు. ఇక పోస్ట్ చూసిన వారంతా అలాంటి సీన్లు నీకు ఇష్టమా అంటూ ట్రోల్ చేస్తున్నారు.