Hi Nanna : ప్రస్తుతం థియేటర్లలో ‘యానిమల్’ ఫీవర్ నడుస్తుండగా.. దానికి పోటీ ఇవ్వడం కోసం ‘హాయ నాన్న’ వచ్చేస్తోంది. రెండు సినిమాలకు అసలు పోలిక లేకపోయినా.. ఈ రెండిటికి ప్రేక్షకుల్లో తగిన హైప్‌ను క్రియేట్ చేశాయి మూవీ టీమ్స్. ఇక ‘హాయ్ నాన్న’ విడుదల తేదీ దగ్గర పడుతుండడంతో ప్రమోషన్స్‌లో మరింత స్పీడ్ పెంచాడు దర్శకుడు శౌర్యువ్. ఇది తనకు మొదటి సినిమానే అయినా నాని సపోర్ట్‌తో ప్రమోషన్స్ విషయంలో ముందుకు వెళ్తున్నాడు.

ఇక తాజాగా శౌర్యువ్ పాల్గొన్న ఇంటర్వ్యూలో ‘హాయ్ నాన్న’ చిత్రాన్ని ప్రముఖ బాలీవుడ్ సినిమాతో పోలుస్తూ ప్రశ్నించగా.. దానికి తను క్లారిటీ ఇచ్చాడు. ‘హాయ్ నాన్న’ ఒక సింగిల్ ఫాదర్ లవ్ స్టోరీ అని మూవీ టీమ్ క్లారిటీ ఇవ్వడంతో పాటు ఇప్పటివరకు విడుదలైన టీజర్లు, ట్రైలర్లు చూసినా కూడా అర్థమవుతోంది. అయితే ఇలాంటి సింగిల్ ఫాదర్ కథలు అన్నింటితో ‘హాయ్ నాన్న’ను పోలుస్తున్నారు నెటిజన్లు. ఇప్పటికే ఈ మూవీ ట్రైలర్ చూస్తుంటే తమిళ చిత్రం ‘డాడా’ రీమేక్‌లాగా ఉందని పలు ఇంటర్వ్యూల్లో మూవీ టీమ్‌కు ప్రశ్నలు ఎదురయినా.. ఇది రీమేక్ కాదని టీమ్ క్లారిటీ ఇచ్చింది.

ఇంతలోనే తాజాగా మరో ఇంటర్వ్యూలో ఒక క్లాసిక్ బాలీవుడ్ చిత్రంతో ‘హాయ్ నాన్న’ను పోల్చగా దర్శకుడు శౌర్యువ్ మరోసారి అందరికీ క్లారిటీ ఇచ్చాడు. ‘హాయ్ నాన్న’ను చూస్తుంటే షారుఖ్ ఖాన్ హీరోగా తెరకెక్కిన బాలీవుడ్ క్లాసిక్ మూవీ ‘కుచ్ కుచ్ హోతా హై’ గుర్తొస్తుందని సోషల్ మీడియాలో కథనాలు మొదలయ్యాయి. అంతే కాకుండా నాగార్జున హీరోగా తెరకెక్కిన ‘సంతోషం’ కూడా తండ్రీ, కొడుకుల కథే అని నెటిజన్లు గుర్తుచేస్తున్నారు. ఇక తాజాగా ఈ అన్ని కథనాలపై శౌర్యువ్ స్పందించాడు. ‘‘ఒక సింగిల్ తండ్రి మళ్లీ ప్రేమలో పడతాడు కాబట్టి ఈ సినిమాతో పోలికలు ఉండడం సహజం. కానీ ఇది పూర్తిగా నేను నా చుట్టూ ఉన్న విషయాలను గమనిస్తూ రాసుకున్న కథ’’ అని శౌర్యువ్ తెలిపాడు.