Dhootha Web Series : ఈమధ్య కాలం లో కొంతమంది క్రేజీ హీరోలు మరియు హీరోయిన్లు కేవలం సినిమాలు మాత్రమే కాకుండా, వెబ్ సిరీస్ లు కూడా చేస్తూ రావడం మనమంతా గమనించొచ్చు. ఆ వెబ్ సిరీస్ లకు అద్భుతమైన రెస్పాన్స్ కూడా వచ్చింది. ఇప్పుడు నాగ చైతన్య కూడా ‘దూత’ అనే వెబ్ సిరీస్ తో అమెజాన్ ప్రైమ్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఈమధ్య కాలం లో నాగ చైతన్య చేస్తున్న ప్రతీ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొడుతూ వచ్చింది. దీంతో ఆయన అభిమానులు కచ్చితంగా ఈ వెబ్ సిరీస్ తో తమని అలరిస్తాడని భారీ ఆశలు పెట్టుకున్నారు. రీసెంట్ గానే విడుదలైన ఈ వెబ్ సిరీస్ కి ఫ్యాన్స్ మరియు ఆడియన్స్ నుండి ఎలాంటి రెస్పాన్స్ వచ్చిందో ఒకసారి చూద్దాం.
కథ :
సాగర్ వర్మ అవధూరి (నాగ చైతన్య) ఒక ప్రముఖ జర్నలిస్ట్. అప్పుడే కొత్తగా ప్రారంభం కాబోతున్న సమాచార్ పత్రికకు చీఫ్ ఎడిటర్ గా బాధ్యతలు స్వీకరిస్తాడు. అతనికి అసిస్టెంట్స్ గా అమృత (ప్రాచీ దేశాయ్) మరియు చంద్రమూర్తి (విజయ్ ప్రకాష్) లు కూడా ఆయన జాయిన్ అయిన రోజే చేరుతారు. అయితే ఒకరోజు తన భార్య ప్రియా (ప్రియా భవాని శంకర్), కూతురు అంజలీ మరియు పెంపుడు కుక్క ‘ఏ’ తో కలిసి ఇంటికి వెళ్తున్న సమయం లో ఒక హోటల్ దగ్గర ఆగుతాడు. ఆ హోటల్ లో ఆయన ఒక పేపర్ కటింగ్ చూస్తాడు. అందులో నీ పెంపుడు కుక్క ‘ఏ’ రోడ్డు ప్రమాదం లో చనిపోతుంది అని ఉంటుంది.
అందులో ఉన్నట్టుగానే రోడ్డు మీద ఉన్న సాగర్ కార్ ని లారీ గుద్దేస్తుంది. అందులో ఉన్న ఆయన పెంపుడు కుక్క ‘ఏ’ చనిపోతుంది. ఆ తర్వాత ఇలాగే తనకి దగ్గరైన వాళ్ళను ముందుగా తెలియచేసి చంపుతూ ఉంటారు. ఇంతకు ఎవరు ఈ మర్డర్స్ అన్నీ చేస్తున్నారు?, సాగర్ ఆ హంతకుడిని పట్టుకొని ప్రతీకారం తీర్చుకున్నాడా లేదా?, ఎందుకు ఆయన కుటుంబాన్ని సాగర్ అలా టార్గెట్ చేసాడు అనేది చూస్తేనే థ్రిల్లింగ్ గా ఉంటుంది.
విశ్లేషణ :
సాధారణంగా విక్రమ్ కుమార్ చాలా విభిన్నమైన కథాంశాలను ఎంచుకొనే సినిమాలను చేస్తూ ఉంటాడు. మొదటి సినిమా నుండి ఆయన కథలను చూస్తే మనకి ఈ విషయం అర్థం అవుతుంది. ఈ సినిమాలో కూడా అదే చేసాడు. తీసుకున్న పాయింట్ చాలా చక్కగా ఉంది, ఇలాంటి కథలకు సస్పెన్స్ తో కూడిన ఎలిమెంట్స్ చాలా అవసరం. అవేమి మిస్ కాకుండా చూసుకున్నాడు విక్రమ్. ప్రతీ సన్నివేశం ఆడియన్స్ బుర్రకి ఎక్కువ పని పెట్టకుండా, వాళ్ళను థ్రిల్ కి గురి చేస్తూ తన టేకింగ్ టాలెంట్ ని నిరూపించుకున్నాడు. ప్రతీ ఎపిసోడ్ ఎండింగ్ లో తర్వాతి ఎపిసోడ్ లో ఏమి జరగబోతుంది అనే క్యూరియాసిటీ ని ఆడియన్స్ లో పెంచడం లో డైరెక్టర్ సక్సెస్ అయ్యాడు.
ఇక నటీనటుల విషయానికి వస్తే అక్కినేని నాగ చైతన్య చాలా సెటిల్ రోల్ తో అదరగొట్టేసాడు. సన్నివేశానికి తగ్గట్టుగా ఆయన పెట్టే ఎక్స్ప్రెషన్స్ సీన్ మూడ్ ని మరో లెవెల్ కి తీసుకెళ్లింది. ఇషాన్ చాబ్రా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా ఈ వెబ్ సిరీస్ కి పెద్ద ప్లస్. ఇక హీరోయిన్ గా ప్రియా భవాని శంకర్ చాలా చక్కగా నటించింది. కథ కి కీలకమైన పాత్రనే కానీ, ఆమెకి ఈ సిరీస్ వల్ల ఎలాంటి ఉపయోగం లేదని అనిపించింది. ఇక మైకాలోస్ సైగులా సినిమాటోగ్రఫీ అద్భుతం అనే చెప్పాలి, చాలా సన్నివేశాలు హాలీవుడ్ స్టైల్ మేకింగ్ లాగ అనిపించింది. క్వాలిటీ పరంగా చూస్తే ఇది ఒక సినిమాగా తీసి థియేటర్స్ లో విడుదల చేసి ఉంటే పెద్ద హిట్ అయ్యేదని చాలా మంది అభిప్రాయం.
చివరి మాట :
ఒక్క మాటలో చెప్పాలంటే నాగ చైతన్య నుండి చాలా కాలం తర్వాత వచ్చిన మంచి కంటెంట్ ఉన్న సబ్జెక్టు. ఈ వీకెండ్ కి థ్రిల్లర్ జానర్ మూవీ లవర్స్ కి ఈ వెబ్ సిరీస్ ఒక మంచి ఛాయస్.
నటీనటులు : నాగ చైతన్య అక్కినేని, ప్రియా భవాని శంకర్, ప్రాచీ దేశాయ్, రవీంద్ర విజయ్, రఘు కుంచె తదితరులు
రచన – దర్శకత్వం : విక్రమ్ కె కుమార్
సంగీతం : ఇషాన్ చాబ్రా
సినిమాటోగ్రఫీ : మైకాలోజ్ సైగులా
ఎడిటింగ్ : నవీన్ నూలీ
రేటింగ్ : 3 /5