Raghavendra Rao : దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. దాదాపు 100కి పైగా సినిమాలకు దర్శకత్వం వహించి ఓ చరిత్రను సృష్టించారు. ఆయన సినిమాల్లో హీరోయిన్లను చూపించే విధానం కోసమైనా జనాలు థియేటర్లకు వెళ్తుంటారు. అలాంటి దర్శకుడు ప్రస్తుతం సినిమాలు తీయకపోయినా ఇటీవల కాలంలో ఆయన వార్తలో నిలుస్తున్నారు.
చంద్రబాబు జైలు వ్యవహారంలో ఇటీవల ఆయన సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులు తెగ వైరల్ అయ్యాయి. టీడీపీకి మద్దతుగా ట్వీట్లు వేస్తూ, లోకేష్ పిలుపునిచ్చిన నిరసనల్లో పాల్గొంటూ ఆయన సోషల్ మీడియాలో హల్ చల్ చేశారు. సీన్ కట్ చేస్తే రాఘవేంద్రరావు కూడా ప్రస్తుతం కోర్టు కేసులతో వార్తల్లో నిలిచారు. ఆయనకు తెలంగాణ హైకోర్టు నోటీసులు అందజేసింది. హైదరాబాద్ లోని విలువైన భూమి విషయంలో ఆయన కోర్టు కేసులో చిక్కుకున్నారు. హైదరాబాద్ బంజారాహిల్స్ ఏరియాలోని షేక్ పేట్ లో రెండెకరాల భూమిని ప్రభుత్వం సినీ పరిశ్రమ అభివృద్ధి కోసం కేటాయించింది.
ఈ భూమిని దర్శకుడు కె.రాఘవేంద్రరావుతో సహా ఇతరులు తన సొంత అవసరాలకు వాడుకుంటున్నారని ఆరోపణలు వస్తున్నాయి. ఈ మేరకు తెలంగాణ హైకోర్టులో పిల్ దాఖలైంది. మెదక్‌కు చెందిన బాలకిషన్ అనే వ్యక్తి 2012లో పిల్ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన కోర్టు రాఘవేంద్రరావు సహా మరికొందరికి నోటీసులు జారీ చేసింది. ఈ ఏడాది మార్చిలోనే ఈ పిల్ విచారణలో కోర్టు దర్శకేంద్రుడు రాఘవేంద్రరావుకి నోటీసులు జారీ చేసింది. అయితే అవి ఆయనకు అందినట్టుగా రికార్డుల్లో నమోదు కాకపోవడంతో.. మరో సారి కోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ కేసు విచారణను జనవరి 18కి వాయిదా వేసింది.
బంజారాహిల్స్ సర్వే నెం. 403/1లో రెండెకరాల భూమిని వాణిజ్య అవసరాలకు వినియోగించారనేది వారి పై వచ్చిన ప్రధాన ఆరోపణ. రాఘవేంద్రరావు సహా ఆయన బంధువులు కృష్ణమోహన్ రావు, చక్రవర్తి, విజయ లక్ష్మి, అఖిలాండేశ్వరి, లాలస దేవి పలువురికి కోర్టు నోటీసులిచ్చింది.