వరుస హిట్స్ తో దూసుకుపోతున్న బాలయ్య బాబు, అపజయమే ఎరుగని డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న అనిల్ రావిపూడి , ఇద్దరు కలిసి చేసిన ‘భగవంత్ కేసరి’ చిత్రం రీసెంట్ గానే గ్రాండ్ గా విడుదలై సూపర్ హిట్ టాక్ ని సొంతం చేసుకున్న సంగతి మన అందరికీ తెలిసిందే. బాలయ్య ఇలాంటి సెటిల్ పెర్ఫార్మన్స్ ఉన్న సినిమా చేసి చాలా సంవత్సరాలు అయ్యింది.
ప్రతీ సినిమాలోనూ ఊర మాస్ సన్నివేశాలు, అదిరిపోయే రేంజ్ యాక్షన్ డైలాగ్స్ తో పిచ్చెక్కించే బాలయ్య ఈ చిత్రం లో మాత్రం వయస్సు కి తగ్గ పాత్ర పోషించి ఎమోషనల్ సన్నివేశాల్లో ఫ్యామిలీ ఆడియన్స్ చేత కంటతడి పెట్టించాడు. బాలయ్య లో ఈ యాంగిల్ ని బయటకి తీసుకొచ్చిన అనిల్ రావిపూడి పై అభిమానుల నుండి ప్రశంసల వర్షం కురుస్తుంది. ఈ సందర్భంగా మూవీ టీం సక్సెస్ మీట్ ని ఏర్పాటు చేసి ప్రేక్షకులకు కృతఙ్ఞతలు తెలియచేసారు.
ఇదంతా పక్కన పెడితే ఈ సినిమాలో బాలయ్య బాబు పెంపుడు కూతురిగా శ్రీలీల నటించింది. ఇన్ని రోజులు ఈమెకి కేవలం డ్యాన్స్ మాత్రమే వచ్చు అని అనుకున్న ఆడియన్స్ కి, ఈ సినిమాలో తన నట విశ్వరూపం చూపించి అందరినీ ఆశ్చర్యపరిచింది. ముఖ్యంగా ఎమోషనల్ సన్నివేశాల్లో చాలా సహజం గా నటించి శభాష్ అనిపించుకుంది. అయితే ఈ సినిమాలో శ్రీలీల సొంత తండ్రిగా జైలర్ పాత్రలో తమిళ హీరో శరత్ కుమార్ కాసేపు కనిపిస్తాడు.
అయితే ఈ చిత్రం లో ఆయన చనిపోయినప్పుడు టీవీ స్క్రోలింగ్స్ లో జైలర్ అని కాకుండా సీఐ చనిపోయాడు అని వేస్తారు. ఈ తప్పు గురించి విలేఖరులు అనిల్ రావిపూడి ని అడగగా ‘ఇంత పెద్ద సినిమాలో అంత చిన్న తప్పు కనిపెట్టడం సాధారణమైన విషయం కాదు. మీ సూక్ష్మ బుద్ధికి నా సెల్యూట్, దయచేసి ఆ మిస్టేక్ జరిగినందుకు క్షమించండి, నా తదుపరి చిత్రాల్లో ఇలాంటి వాటిపై జాగ్రత్తలు తీసుకుంటాను’ అంటూ చెప్పుకొచ్చాడు.