Manchu Lakshmi : స్వలింగ సంపర్కుల వివాహాలకు చట్టబద్ధత కల్పించాలంటూ గత కొంత కాలంగా దేశ వ్యాప్తంగా డిమాండ్ వినిపిస్తోంది. కొంత మంది ఏకంగా సుప్రీకోర్టు తలుపు తట్టారు. సేమ్ సెక్స్ మ్యారేజెస్ ను చట్టబద్దంగా గుర్తించాలని న్యాయస్థానానికి విజ్ఞప్తి చేశారు. రీసెంట్ గా ఈ కేసుపై విచారణ జరిపిన దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు కీలక తీర్పును వెల్లడించింది.

స్వలింగ సంపర్కుల వివాహానికి చట్టబద్దత కల్పించేందుకు నిరాకరించింది. అయితే, వారు సహజీవనం చేసుకునే హక్కు ఉందని తెలిపింది. స్వలింగ సంపర్క జంటలపై ఎలాంటి వివక్ష చూపించకూడదని తెలిపింది. వారి హక్కులను పరిరక్షించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను సుప్రీంకోర్టు ఆదేశించింది. సుప్రీంకోర్టు తాజా నిర్ణయంపై నటి మంచులక్ష్మి తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. ఈ తీర్పు తనకు తీవ్ర నిరాశను కలిగించిందని పేర్కొంది.

“సేమ్ జెండర్ వివాహాలకు సుప్రీంకోర్టు చట్టబద్దత కల్పించలేమని చెప్పడం నాకు తీవ్ర నిరాశనకు కలిగించింది. నా గుండె పగిలేలా చేసింది. అన్ని రకాల ప్రేమలను స్వీకరించి, మిగతా ప్రపంచానికి ప్రేమ గురించి బోధించిన దేశానికి ఇది నిజంగా అవమానం. ఇతర దేశాల్లో ఎవరికి వారు స్వేచ్ఛగా తమ జీవితాలను కొనసాగిస్తున్నారు. మన దేశంలో సేమ్ జెండర్ మ్యారేజెస్ ను అంగీకరించలేమా?” అని మంచు లక్ష్మి ప్రశ్నించారు.