నటీనటులు : నార్నే నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్, శ్రీగౌరి ప్రియా రెడ్డి, ఆనంతిక, గోపిక ఉదయన్, అనుదీప్
డైరెక్టర్ : కళ్యాణ్ శంకర్
సంగీతం : భీమ్స్ సిసిరోలియో
నిర్మాత : సూర్య దేవర నాగవంశీ
సినిమాటోగ్రఫీ : షాందత్-దినేష్ కృష్ణన్
Mad : ఈ ఏడాది చిన్న సినిమాల హవా ఏ రేంజ్ లో కొనసాగిందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. అతి తక్కువ బడ్జెట్ తో కొత్తవాళ్లతో తీసిన సినిమాలు బయ్యర్స్ కి కాసుల వర్షం కురిపించాయి. దీంతో టాప్ నిర్మాణ సంస్థలు సైతం చిన్న సినిమాలను నిర్మించడానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నాయి. అలా టీజర్, ట్రైలర్ దశ నుండే ప్రేక్షకుల్లో అమితాసక్తిని రేపిన చిత్రం ‘మ్యాడ్’. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నాగ వంశీ నిర్మాతగా వ్యహరించిన ఈ సినిమా ద్వారా జూనియర్ ఎన్టీఆర్ బావ నార్నే నితిన్ ఇండస్ట్రీ కి హీరో గా పరిచయం అయ్యాడు. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో జాతి రత్నాలు చిత్రాన్ని మించిన కామెడీ ఇందులో ఉంటుంది, లేకపోతే టికెట్ డబ్బులు రిటర్న్ చేస్తా అంటూ నిర్మాత నాగవంశీ మాట్లాడిన మాటలు ఈ చిత్రం పై అంచనాలు రెట్టింపు అయ్యేలా చేసింది. ఈరోజు గ్రాండ్ గా విడుదలైన ఈ సినిమా ఆ అంచనాలను అందుకుందా లేదా అనేది ఈ రివ్యూ లో చూడబోతున్నాం.
కథ :
ఇంజనీరింగ్ చేరిన ఒక కుర్రాడు, ఈ కాలేజీ నాకొద్దు బాబోయ్ అని పారిపోతున్న సమయం లో ఒక సూపర్ సీనియర్ (విష్ణు ఓయ్) అతనిని పట్టుకొని, కూర్చోబెట్టి ఇంజనీరింగ్ కాలేజీ లైఫ్ ఎలా ఉంటుంది?, ఇక్కడ పరిచయమయ్యే స్నేహితుల వల్ల మన జీవితం లో వచ్చిన మార్పులేంటి?, వంటి విషయాలను చెప్తూ, మనోజ్ ( రామ్ నితిన్), అశోక్ (నార్నే నితిన్) మరియు దామోదర్ (సంగీత్ శోభన్ ) కథ గురించి చెప్పడం మొదలుపెడతాడు ఆ సూపర్ సీనియర్. ఈ ముగ్గురు కాలేజీ రోజుల్లో చేసిన అల్లరి , గొడవ పడిన సందర్భాలు, హాస్టల్ లో వేసిన చిల్లర వేషాలు, అమ్మాయిలతో కలిపినా పులిహోర వ్యవహారాలు, ఇలా కాలేజీ లైఫ్ ని మొత్తం వెండితెర మీద చూసుకున్నట్టుగా అనిపిస్తాది.
విశ్లేషణ :
ఈ సినిమాకి పేరు కి ముగ్గురు హీరోలు కానీ, సంగీత్ శోభన్ మిగిలిన ఇద్దరు హీరోలను పూర్తిగా డామినేట్ చేసాడు. అతని నటన మరియు కామెడీ టైమింగ్ వల్ల సినిమా మరో లెవెల్ కి రీచ్ అయ్యింది. అతని తర్వాత మనోజ్ అనే లవర్ బాయ్ పాత్రలో నటించిన రామ్ నితిన్ ఎక్కువ మార్కులు కొట్టేసాడు. వీళ్లిద్దరి సినిమాకి మెయిన్ పిల్లర్స్ గా నిలిచారు. ఇక జూనియర్ ఎన్టీఆర్ బావ నార్నే నితిన్ నటన కంటే ఎక్కువ గా తన స్క్రీన్ ప్రెజెన్స్ తో డామినేట్ చెయ్యడానికి చూసాడు కానీ పెద్దగా వర్కౌట్ కాలేదు. వీళ్లిద్దరి నటన ముందు అతను తేలిపోయాడు. ఈ చిత్రాన్ని చూస్తున్నంత సేపు కాలేజీ లైఫ్ లో మన దోస్తులతో చేసిన చిలిపి వేషాలన్నీ గుర్తుకు వస్తాయి. డైరెక్టర్ కళ్యాణ్ శంకర్ కామెడీ టైమింగ్ తో రాసిన పంచులు థియేటర్స్ నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది.
ఇక ఈ సినిమాకి భీమ్స్ ఇచ్చిన ఇచ్చిన మ్యూజిక్ మరో పెద్ద పాజిటివ్ గా చెప్పొచ్చు. పాటలు మంచిగా క్లిక్ అయ్యాయి, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సన్నివేశాలకు తగ్గట్టుగా చక్కగా సెట్ అయ్యింది. ఫస్ట్ హాఫ్ మొత్తం కాస్త ల్యాగ్ అనిపించినా, సెకండ్ హాఫ్ మొత్తం ఇంచ్ గ్యాప్ కూడా లేకుండా హిలేరియస్ కామెడీ పంచులతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించాడు డైరెక్టర్ కళ్యాణ్ శంకర్. కథ కంటే ఎక్కువగా అతను డైలాగ్స్ మీదనే ఎక్కువ ఫోకస్ పెట్టాడు. అవి వర్కౌట్ అవ్వకపోయ్యుంటే ప్రేక్షకులకు తలనొప్పిగా మారేది, వర్కౌట్ అయ్యింది కాబట్టి ఈరోజు డైలాగ్స్ గురించి అందరూ అంత ప్రత్యేకంగా మాట్లాడుకుంటున్నారు. ఇక షాందత్-దినేష్ కృష్ణన్ సినిమాటోగ్రఫీ చాలా బాగుంది, సన్నివేశానికి తగ్గట్టుగా లైటింగ్స్ మరియు కలర్ గ్రేడింగ్ సెటప్ పర్ఫెక్ట్ గా కుదిరాయి.
చివరి మాట :
మన స్నేహితుల గ్యాంగ్ తో కలిసి కాసేపు థియేటర్ లో కూర్చొని ఒక రేంజ్ లో ఎంజాయ్ చేయదగ్గ సినిమా ఇది. తప్పక మిస్ అవ్వొద్దు.
రేటింగ్ : 3.5/5