Siddharth : కోలీవుడ్ హీరో సిద్ధార్థ నటించిన తాజా చిత్రం ‘చిత్తా’. ఇది చిన్నా పేరుతో తెలుగులో విడుదల కానుంది. ఈ నెల 28న తమిళంతో పాటు కన్నడలో ఏకకాలంలో విడుదలైంది. ఈ క్రమంలో ఆయన మూవీ ప్రమోషన్ కోసం కర్నాటకకు వెళ్లారు. ఆ సందర్భంలో హీరో సిద్ధార్థ్ కు ఘోర అవమానం జరిగింది. బెంగళూరులోని ఓ హోటల్ లో ప్రెస్ మీట్ పెట్టారు. హీరో సిద్ధార్థ్ మాట్లాడుతుండగా కావేరీ జలాల పోరాట సమితి సభ్యులు ఆయన ప్రెస్ మీట్ ను అడ్డుకున్నారు. నువ్వు తమిళోడివి నీకు కర్ణాటకలో ఏం పనంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే ప్రెస్ మీట్ నిలిపివేయాలని డిమాండ్ చేశారు. తమిళ సినిమాలను కర్ణాటకలో ప్రోత్సహించవద్దని అక్కడ ఉన్న విలేకరులకు విజ్ఞప్తి చేశారు.
అక్కడ తనకు ఎదురైన అవమానంపై హీరో సిద్ధార్థ్ స్పందించారు. బెంగళూరులో తన ప్రెస్ మీట్‌ను నిరసనకారులు అడ్డుకోవడం చాలా బాధాకరమన్నారు. తన సినిమాకు, అక్కడ జరుగుతున్న కావేరి జలాల వివాదానికి ఏం సంబంధం అని ప్రశ్నించారు. ఈ ప్రెస్ మీట్ ను అడ్డుకోవడంతో చిత్ర నిర్మాణ సంస్థకు పెద్ద నష్టం వాటిల్లిందని ఆవేదన వ్యక్తం చేశారు. ‘చిన్నా’ సినిమా నిర్మాతగా రిలీజ్ కు ముందే ఈ సినిమాను చాలా మందికి చూపించాలనుకున్నాను. చెన్నైలో కొంత మందికి చూపించాను. అలాగే బెంగళూరులో మీడియా ప్రతినిధులకు చూపించాలనుకున్నాను. వారితో పాటు 2 వేల మంది స్టూడెంట్స్ కు కూడా సినిమా చూపించాలి అనుకున్నాను. కానీ, బెంగుళూరు బంద్ కారణంగా రద్దు చేయాల్సి వచ్చింది. దీని వల్ల నిర్మాణ సంస్థకు పెద్ద మొత్తంలో నష్టం జరిగింది” అని సిద్ధార్థ్ బాధను వ్యక్తపరిచారు. సిద్ధార్థ్ కు జరిగిన అవమానంపై ప్రకాష్ రాజ్, శివరాజ్ కుమార్ సోషల్ మీడియా వేదికగా ఇప్పటికే కన్నడ ప్రజల తరఫున క్షమాపణలు చెప్పారు.