అల్లు అర్జున్ కథానాయకుడిగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న యాక్షన్ డ్రామా ‘పుష్ప: ది రూల్’. 2021లో వచ్చిన ‘పుష్ప: ది రైజ్’కు సీక్వెల్‌గా దీన్ని తీసుకొస్తున్నారు. తొలి భాగం బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకున్న నేపథ్యంలో ‘పుష్ప2’ ఆ అంచనాలను అందుకునేలా తీర్చిదిద్దుతున్నారు. వచ్చే ఏడాది ఆగస్టు 15న ‘పుష్ప2’ను విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది.
రిలీజ్ డేట్ ప్రకటిస్తూ పంచుకున్న పోస్టర్లో అల్లు అర్జున్ చేతిని చూపిస్తూ, అందులో చిటికెన వేలు గోరును హైలైట్ చేసింది చిత్ర బృందం. కొన్ని రోజుల కిందట ‘వేర్ ఈజ్ పుష్ప’ పేరుతో విడుదల చేసిన వీడియోలోనూ అదే గోరును హైలైట్ చేశారు. అయితే అప్పట్లో దాని గురించి అంతగా పట్టించుకోలేదు. కానీ, ప్రస్తుతం సామాజిక మాధ్యమాల వేదికగా దీనిపైనే చర్చ జరుగుతోంది. ఇలా కేవలం చిటికెన వేలు గోరును ప్రత్యేకంగా చూపించడం వెనుక ఓ థియరీ ఉందని చెబుతున్నారు. అదేంటంటే, కొన్ని సంస్కృతుల్లో తమ సంపదను, సమాజంలో స్థాయిని చూపించేందుకు చిటికెన వేలు గోరు పెంచుకుంటారట. అంతేకాదు, కేవలం రూల్ చేయడానికి మాత్రమే తాము ఉన్నట్లు గుర్తుగా చూపించడానికి కూడా పెంచుతారని అంటున్నారు.
ఇక ఎర్ర చందనం వ్యాపారాన్ని చిటికెన వేలుపై నిలబెట్టి చేయడగలడని సూచనగా దాన్ని హైలైట్ చేస్తున్నట్టు టాక్. సుకుమార్ తీసే ప్రతి షాట్ విషయంలోనూ కొన్ని రిఫరెన్స్‌లు ఉంటాయి. అవేంటో స్వయంగా ఆయనే చెబితేనే తెలుస్తుంది. గతంలో ‘రంగస్థలం’లో జగపతిబాబు పాత్రకు పామును రిఫరెన్స్‌గా తీసుకున్నారు. పామును ఏ విధంగానైతే కొట్టి చంపుతారో అలాగే ఫణీంద్రభూపతి (జగపతిబాబు)ని కూడా చిట్టిబాబు (రామ్‌చరణ్) కొట్టి చంపుతాడు. మరి ఇప్పుడు అల్లు అర్జున్ గోరును హైలైట్ చేయడం వెనుక ఏముందో చూడాలి.