తన కెరీర్ ప్రారంభ రోజుల్లో ఎదుర్కొన్న ఇబ్బందులను కృతి తాజాగా ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. ర్యాంప్ వాక్ సమయంలో ఓ కొరియోగ్రాఫర్ తనతో దురుసుగా ప్రవర్తించారంటూ నాటి చేదు అనుభవాన్ని గుర్తుచేసుకున్నారు. ‘‘కెరీర్లో అవకాశాలు రాకపోతే ఉన్నత చదువులను కొనసాగించాలని ఇండస్ట్రీకి రాకముందే నిర్ణయించుకున్నా. అందుకే ఒకవైపు మోడలింగ్ చేస్తూనే మరోవైపు పోటీ పరీక్షలకు శిక్షణ తీసుకునేదాన్ని. నా మొదటి ర్యాంప్ వాక్‌లో ఎదుర్కొన్న చేదు అనుభవం నాకిప్పటికీ గుర్తుంది.
మోడలింగ్‌లోకి అడుగుపెట్టిన తొలినాళ్లలో అక్కడి వాతావరణం, వ్యక్తుల గురించి నాకు పెద్దగా తెలియదు. దీంతో నేను కాస్త గందరగోళానికి గురయ్యాను. ఒకరోజు హైహీల్స్ వేసుకుని గడ్డిలో నడవాల్సి వచ్చింది. ఆ చెప్పులు గడ్డిలో కూరుకుపోయి ఇబ్బంది పడ్డాను. దీంతో అక్కడే ఉన్న కొరియోగ్రాఫర్ దురుసుగా ప్రవర్తించింది. అందరి ముందు నన్ను దారుణంగా తిట్టింది. ఆ సమయంలో నాకు కన్నీళ్లు ఆగలేదు. కానీ, నేను దేనికీ వెనుకడుగు వేయను’’ అంటూ అప్పటి రోజులను గుర్తుచేసుకున్నారు.
అలా ప్రవర్తించిన కొరియోగ్రాఫర్‌తో మరోసారి పనిచేయలేదని తెలిపారు. ఇక మోడలింగ్ చేస్తోన్న సమయంలోనే మహేశ్ బాబు నటించిన ‘1:నేనొక్కడినే’ సినిమాలో అవకాశం వచ్చినట్లు కృతి సనన్ తెలిపారు. అలాగే ‘హీరోపంటి’ చిత్రబృందం కూడా అదే సమయంలో సంప్రదించినట్లు చెప్పారు. ఈ రెండు సినిమాల షూటింగ్ గ్యాప్‌లోనూ తను పరీక్షలకు సన్నద్ధమైనట్లు తెలిపారు. భవిష్యత్తుకు సంబంధించి ఎప్పుడూ రెండు ప్రణాళికలు ఉండాలని కృతి వివరించారు.