Sushanth : చిత్రసీమలో అందరికీ అదృష్టం వరిస్తుందనడానికి లేదు. అది పెద్ద ఫ్యామిలీ నుంచి వచ్చినా లేక స్వయంకృషితో అడుగుపెట్టినా బ్రేక్ అనేది చాలా అరుదుగా మాత్రమే దొరుకుతుంది. అయితే కొంతమందికి మాత్రమే మెయిన్ లీడ్ కలిసొస్తుంది. కానీ మరికొంతమంది మాత్రం హీరోగా కలిసి రాకపోతే క్యారెక్టర్ ఆర్టిస్ట్ అవతారమెత్తి సక్సెస్ అందుకుంటున్నారు. ఇప్పుడు అక్కినేని హీరో సుశాంత్ కూడా ఈ జాబితాలో చేరిపోయారు. ఇప్పటికే అల వైకుంఠపురములో సైడ్ క్యారెక్టర్లో కనిపించిన ఈ హీరో తాజాగా చిరంజీవితో కలిసి భోళా శంకర్ లో నటించాడు. ఈ సినిమా విడుదల దగ్గరపడుతుండడంతో ప్రమోషన్లలో బిజీ అయ్యాడు. ఈ సందర్భంగా పలు ఆసక్తికర అంశాలు పంచుకున్నాడు.
సెకండ్ ఇన్నింగ్స్ గురించి మాట్లాడుతూ.. ‘‘ఏదీ ప్లాన్ చేసింది కాదు. హీరో, గెస్ట్ రోల్, సపోర్టింగ్ క్యారెక్టర్.. ఇలా అన్నీ నాకు నచ్చినవే చేస్తున్నా. ‘అల వైకుంఠపురములో’ చిత్రంలో దర్శకుడు త్రివిక్రమ్ నన్ను కొత్తగా చూపించారు. ఆ సినిమాకి పనిచేసే సమయంలో ఎన్నో కొత్త విషయాలు నేర్చుకున్నా. దర్శకుడు సుధీర్‌వర్మ ‘రావణాసుర’లో ఓ విభిన్న పాత్రలో నన్ను చూపించారు. ‘భోళాశంకర్’ విషయానికి వస్తే.. డైరెక్టర్ మెహర్ రమేశ్ ఓసారి ఫోన్ చేసి, ఈ సినిమా గురించి చెప్పారు. చిరంజీవిసర్తో ఓ పాటలోనూ నటించే అవకాశం ఉందనడంతో వెంటనే ఈ సినిమాకి ‘ఎస్’ చెప్పా. చిరంజీవితో పని చేయాలనే కోరిక ఎప్పటి నుంచో ఉంది. ఆయన సినిమాలు చూస్తూ పెరిగా. ఆయన డ్యాన్స్ అంటే నాకు బాగా ఇష్టం. బాల్యంలో ఆయన సినిమాల షూటింగ్‌కు వెళ్లేవాణ్ని’’ అన్నాడు.
ఇక ‘భోళా శంకర్’లో తన పాత్ర గురించి కూడా చెప్పాడు.‘‘బ్రదర్- సిస్టర్ సెంటిమెంట్ ప్రధానంగా సాగే సినిమా ఇది. నేను అతిథి పాత్ర పోషించా. చిరంజీవి, కీర్తి సురేశ్, తమన్నాతో నాకు కీలక సన్నివేశాలు ఉంటాయి. ఈ సినిమా షూటింగ్‌ని బాగా ఎంజాయ్ చేశా. నా మొదటి సినిమా (కాళిదాసు) హీరోయిన్ తమన్నా. అందులో ప్రేమికులుగా కనిపించిన మేమిప్పుడు బ్రదర్, సిస్టర్‌గా నటించాం. కొన్ని సన్నివేశాల్లో చిరంజీవి ట్యాక్సీ డ్రైవర్‌గా, నేను పాసింజర్గా కనిపిస్తాం. నేను కారు దిగే సమయంలో ఆయన డోర్ తీస్తుంటే నా మనసు కలచివేసింది. దాంతో, నేనే డోర్ తీసి బయటకు వస్తుంటే.. ‘నాపై నీ గౌరవం స్పష్టంగా కనిపిస్తుంది. నేనే డోర్ తీయాలి’ అని చిరంజీవి అన్నారు. ఆయన ఇందులో పలు షేడ్స్‌లో కనిపిస్తారు’’ అంటూ సినిమాపై అంచనాలు పెంచేశాడు.