Manchu Manoj : టాలీవుడ్ హీరో మంచు మనోజ్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఎవరైనా ఏదైనా సహాయం కోరితే ఇట్టే చేసేస్తారు మంచు మనోజ్. ప్రస్తుతం టాలీవుడ్ చిత్ర పరిశ్రమంలో వరుస సినిమాలు చేసుకుంటూ ముందుకు సాగుతున్న మంచు మనోజ్… ఈ ఏడాది మార్చి మాసంలో రెండో వివాహం చేసుకున్న సంగతి మనందరికీ తెలిసిందే.ఇప్పుడు మనోజ్.. రాజకీయ అరంగేట్రానికి ముహూర్తం ఖరారైనట్టే కనిపిస్తోంది. తెలుగుదేశం పార్టీలో చేరడానికి మంచు మనోజ్ సన్నాహాలు చేస్తోన్నట్లు తెలుస్తోంది.
ఈ దిశగా ఆయన తొలి అడుగు వేసినట్టే. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడితో భేటీ కావడంతో ప్రాధాన్యతను సంతరించుకుంది. మంచు మనోజ్, ఆయన భార్య భూమా మౌనికా రెడ్డి ఈ సాయంత్రం హైదరాబాద్ జూబ్లీహిల్స్ నివాసంలో చంద్రబాబుతో సమావేశం అయ్యారు. సుమారు 40 నిమిషాల పాటు ఆయనతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పలు అంశాలు వారిమధ్య ప్రస్తావనకు వచ్చాయి. రాజకీయాలతో పాటు కుటుంబపరమైన విషయాలపైనా వారు చర్చించారు. ఈ భేటీ ముగిసిన అనంతరం మంచు మనోజ్.. విలేకరులతో మాట్లాడారు. ఈ సమావేశానికి ఎలాంటి రాజకీయ ప్రాధాన్యతా లేదని అన్నారు. మర్యాదపూరకంగా మాత్రమే చంద్రబాబును కలిశానని చెప్పారు.
మౌనికా రెడ్డిని వివాహం చేసుకున్న తరువాత ఇప్పటివరకు చంద్రబాబును కలవలేదని, ఆయనను కలిసి ఆశీర్వాదాన్ని తీసుకోవాలని చాలా సందర్భాల్లో అనుకున్నప్పటికీ.. కుదరలేదని అన్నారు. ఇవ్వాళ చంద్రబాబుకు ఫోన్ చేయగా.. అపాయింట్‌మెంట్ ఇచ్చారని మంచు మనోజ్ వివరించారు. ఆగస్టు 1వ తేదీన కుమారుడు ధీరవ్ పుట్టినరోజు కూడా కావడం వల్ల కుటుంబంతో కలిసి చంద్రబాబు ఆశీర్వాదాన్ని తీసుకున్నానని అన్నారు. చంద్రబాబును కలుసుకోవడం సంతోషంగా ఉందని వ్యాఖ్యానించారాయన. రాజకీయాల్లో ప్రవేశిస్తారంటూ వచ్చిన ప్రచారంపైనా మంచు మనోజ్ స్పందించారు. ఆ వార్తలను కొట్టిపారేయలేదు. రాజకీయాల్లో అడుగుపెట్టే సందర్భం వచ్చినప్పుడు చెబుతానని పేర్కొన్నారు. ఈ సమావేశానికి రాజకీయ ప్రాధాన్యత లేదని భూమా మౌనికారెడ్డి కూడా స్పష్టం చేశారు.