Bro Movie : పవన్ కళ్యాణ్ ఆయన మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ కలిసి నటించిన బ్రో సినిమా శుక్రవారం విడుదలైంది. ఈ చిత్రంలో ఏపీ మంత్రి అంబటి రాంబాబు డ్యాన్స్‌ను అనుకరిస్తూ సీన్లు ఉండడం చర్చనీయాంశం అయిన క్రమంలో కౌంటర్ అటాక్‌కు దిగారు మంత్రి అంబటి రాంబాబు.. బ్రో సినిమా నేను చూడలేదు.. కానీ, బ్రో సినిమాలో నా క్యారెక్టర్ పెట్టి అవమానించారని విన్నాను, నన్ను రాజకీయంగా ఎదుర్కోలేక పవన్ కల్యాణ్ ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నారంటూ ఆయన ఒక రేంజ్ లో విరుచుకుపడ్డారు..
ఎవరో డబ్బులు పెట్టి తీసిన సినిమాలో తాను నటిస్తూ, నా క్యారెక్టర్ పెట్టి ఆనంద పడుతున్నాడు కానీ, నేను ఎవరి దగ్గరో డబ్బులు తీసుకుని, ప్యాకేజీలు తీసుకుని డ్యాన్స్ వేయను అని కామెంట్ చేశారు. ఈ క్రమంలో సినిమాలో అంబటిని అనుకరించిన ప్రముఖ కమెడియన్ థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీ ఘాటుగా స్పందించారు.
‘‘బ్రో.. సినిమా చలనచిత్ర రంగంలో ఒక అద్భుతం. ఇప్పటి వరకు పవన్‌తో కలిసి చాలా హిట్ సినిమాల్లో నటించా. ఈ సినిమాలో నా క్యారెక్టర్, నటనకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా అద్భుతమని ట్రోలింగ్ చేస్తున్నారు. ఇంత మంచి రెస్పాన్స్ వస్తుందని ఊహించలేదు. చిత్ర దర్శకుడు సముద్రఖనికి కృతజ్ఞతలు. ఏపీ మంత్రి అంబటి రాంబాబును ఈ సినిమాలో ఇమిటేట్ చేశానంటున్నారు.
ఆయన్ను ఇమిటేట్ చేయాల్సిన అవసరం లేదు. నటుడిగా నాకిచ్చిన పాత్ర పోషించడం ముఖ్యం. ఆ పాత్ర ఏంటంటే.. ఓ పనికిరాని దద్దమ్మ తన బాధ్యతలన్నీ వదిలేసి క్లబ్బులు, అమ్మాయిల వెంట తిరుగుతుంటాడు. అలాంటి వేషం అది.. అలాగే చేశాను. అంబటి రాంబాబు క్యారెక్టర్ చేయాల్సిన అవసరం నాకు, మా టీమ్‌కు లేదు.
పవన్ కల్యాణ్ గారికి కూడా అలాంటి ఉద్దేశం లేదు. దారి తప్పిన ఓ బడుద్దాయిని దారిలో పెట్టాలనేదే కాన్సెప్ట్. శ్యామ్‌బాబు క్యారెక్టర్ అద్భుతంగా పబ్లిసిటీ అయింది. అంబటి రాంబాబును అనుకరించడానికి ఆయనేమీ ఆస్కార్ నటుడు కాదు. ఆ డ్యాన్స్ అలా ఉందని వారు అనుకుంటున్నారేమో కానీ, మేము అనుకోవటం లేదు. మా కన్నా రాంబాబు గొప్పగా డ్యాన్స్ చేశారు. మా డ్యాన్స్ వేరు.. ఆయన డ్యాన్స్ వేరు. మంత్రిగారిని కించపరుస్తున్నారని అంటున్నారు.. అది కాదు. పవన్ కల్యాణ్ పట్ల.. మంత్రి జోగి రమేశ్ అసభ్యంగా మాట్లాడారు. అదీ కించపరచడమంటే. ఆ విషయం తెలుసుకుంటే మంచిది. 2024 అద్భుతంగా ఉంటుంది. పవన్ కల్యాణ్ నట విశ్వరూపం బ్రో.. సినిమా’’ అని పృథ్వీరాజ్ అన్నారు.