ప్రముఖ సినీ నటి శోభనకు నటిగానే కాకుండా, క్లాసికల్ డ్యాన్సర్ గా కూడా మంచి గుర్తింపు ఉంది. వివిధ భాషల సినిమాల్లో నటించిన శోభన తెలుగులో ఎన్నో చిత్రాలలో నటించి మెప్పించారు. తాజాగా ఆమె ఇంట్లో చోరీ జరిగిన విషయం వెలుగులోకి వచ్చింది. చెన్నైలోని తేనాంపేట శ్రీనివాస రోడ్డులో తన తల్లితో కలిసి ఆమె నివసిస్తున్నారు. కడలూర్ జిల్లా కోవిల్ కు చెందిన విజయ అనే మహిళను ఏడాది క్రితం ఇంట్లో పనిమనిషిగా పెట్టుకున్నారు.
విజయ ఇంట్లోకి వచ్చినప్పటి నుంచి అప్పుడప్పుడు డబ్బులు మాయం అవుతుండటం జరుగుతూ వచ్చింది. దీంతో శోభనకు అనుమానం వచ్చి తేనాంపేట పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. శోభన ఫిర్యాదుతో విజయను అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ జరిపారు. పోలీసు విచారణలో డబ్బును తానే కొట్టేశానని విజయ ఒప్పుకుంది. గత మార్చ్ నుంచి జూన్ వరకు రూ. 41 వేలు చోరీ చేశానని పోలీసులకు తెలిపింది. పేదరికం కారణంగానే తాను ఈ తప్పు చేశానని, తనను మన్నించాలని శోభనను విజయ ప్రాధేయపడింది. ఆమె దీన స్థితికి కరిగిపోయిన శోభన… పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదును వెనక్కి తీసుకుని, మళ్లీ తన ఇంట్లోనే పని చేయడానికి అనుమతించారు.
నటి శోభన గురించి తెలియని సినీ అభిమాని ఉండరు. 80వ దశకం నుంచి 90 దశకం చివరి వరకు ఆమె సౌత్ లో ఎన్నో క్లాసిక్ అనదగ్గ చిత్రాల్లో నటించి మెప్పించారు. హోమ్లీగా నటించి ఫ్యామిలీ ఆడియన్స్ అభిమానాన్ని సొంతం చేసుకున్నారు. తెలుగులో ఆమె చిరంజీవి, నాగార్జున, వెంకీ, బాలయ్య ఇలా స్టార్ హీరోలందరితో స్క్రీన్ షేర్ చేసుకున్నారు. ఐదు పదుల వయసు దాటినప్పటికీ శోభన వివాహం చేసుకోకుండా ఒంటరిగానే ఉన్నారు. శోభన మంచి నటి మాత్రమే కాదు అద్భుతమైన క్లాసికల్ డ్యాన్సర్. దీనితో శోభన ప్రస్తుతం చెన్నైలో డ్యాన్స్ స్కూల్ నిర్వహిస్తూ చెన్నైలో తన తల్లితో జీవిస్తున్నారు. అయితే శోభన నివాసంలో ఊహించని సంఘటన చోటు చేసుకుంది.