సీతారామం ఫేమ్ మృణాల్ ఠాకూర్ తాజాగా లస్ట్ స్టోరీస్ 2 అనే ఆంథాలజీతో ప్రేక్షకులు ముందుకు వచ్చింది. ఈ లస్ట్ స్టోరీస్ 2 నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది. జీవితంలో సంబంధాలు బలోపేతం కావాలంటే అందులో సెక్స్, లస్ట్ (కామం) ముఖ్యమైన పాత్ర పోషిస్తాయని చెబుతూ సాగే ఆంథాలజీ ఇది. ఇందులోనే తమన్నా, ఆమె బాయ్‌ఫ్రెండ్ విజయ్ వర్మ కూడా నటించిన విషయం తెలిసిందే. ఈ సిరీస్ పై తాజాగా మృణాల్ ఠాకూర్ స్పందించింది. అంతేకాదు సెక్స్, లస్ట్ గురించి ఇళ్లలో పిల్లలతో పరిణతి చెందిన సంభాషణలు జరిపితే.. వాళ్లు బయట వాటి గురించి తప్పుడు సమాచారం పొందే అవకాశం ఉండదని కూడా ఆమె చెప్పడం విశేషం.
“సెక్స్, లస్ట్ గురించి పరిణతి చెందిన సంభాషణలు జరగడం ముఖ్యమని నేను బలంగా నమ్ముతాను. ముఖ్యంగా ఇంట్లో యుక్త వయసులో ఉన్న వాళ్లతో దీనిపై మాట్లాడటం అవసరం. వాళ్లకు వీటి గురించి సరైన సమాచారం అందించే ఓ రోల్ మోడల్ అవసరం. ఇలాంటి టాపిక్స్ పై ఇంట్లోని పిల్లలకు నిజాయతీగా వివరించే ఒక్క వ్యక్తి ఉన్నా కూడా వాళ్లు బయట నుంచి వచ్చే తప్పుడు సమాచారాన్ని స్వీకరించరు” అని మృణాల్ ఠాకూర్ చెప్పింది. ఈ లస్ట్ స్టోరీస్ 2 ఆంథాలజీలో అంగద్ బేడీ సరసన మృనాల్ నటించింది. తాను పెళ్లి చేసుకోబోయే వాడిలో కామం ఏమేరకు ఉందో తెలుసుకోవాలని, పెళ్లికి ముందు టెస్ట్ డ్రైవ్ తప్పనిసరి అని ఇందులో ఆమె బామ్మ పాత్ర పోషించిన నీనా గుప్తా చెప్పడం వైరల్ అయిన విషయం తెలిసిందే.
అలాగే రిలేషన్‌షిప్స్ గురించి కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది ‘‘ప్రస్తుతం నటీనటులు వాళ్ల వ్యక్తిగత సంబంధాల గురించి ఓపెన్‌గా మాట్లడగలుగుతున్నారు. ఒకవేళ వాళ్ల భాగస్వామి సినీ పరిశ్రమకు చెందిన వారు కాకపోతే మాత్రమే ఈ విషయాన్ని ప్రైవేటుగా ఉంచుతున్నారు. గతంలో చాలామంది యాక్టర్లు ఈ విషయాల గురించి చెప్పడానికి సంకోచించేవారు. కానీ ప్రస్తుతం ఆ పరిస్థితులు మారాయి.
తారలందరూ రిలేషన్‌షిప్ గురించి చెప్పేస్తున్నారు. ఇలాంటి తరంలో పుట్టినందుకు ఆనందంగా ఉంది. నేనూ ఇంతకుముందు నా ప్రేమ, బ్రేకప్ గురించి ఎన్నో సందర్భాల్లో బయటపెట్టాను. చాలామంది అలా చెప్పడానికి ఆలోచిస్తారు. కానీ, ఇలాంటి అనుభవాలను అందరితో పంచుకుంటే ఎదుటివారు కూడా దీని నుంచి కొన్ని విషయాలు నేర్చుకుంటారని నేను భావిస్తాను. అందుకే నేను కూడా వాటి గురించి చెప్పాను’’.