నటుడు శర్వానంద్ వివాహం నిన్న రాత్రి ఘనంగా జరిగింది. ఈ ఏడాది జనవరి 26న ఎటువంటి ప్రకటన లేకుండా సడన్గా నిశ్చితార్ధం చేసుకొన్న శర్వానంద్, మాజీ మంత్రి అయిన టీడీపీ నేత స్వర్గీయ బొజ్జల గోపాలకృష్ణ రెడ్డి మనవరాలు, హైకోర్టు లాయర్ మధుసూధనా రెడ్డి కూతురు రక్షిత రెడ్డిని పెళ్లి చేసుకున్నాడు. వీరి పెళ్లి జైపూర్ లోని లీలా ప్యాలెస్లో జరిగింది. జూన్ 2న ఉదయం హల్దీ ఫంక్షన్ జరగగా, అదే రోజు రాత్రి సంగీత్ వేడుక జరిగింది. ఇక జూన్ 3 రాత్రి 11 గంటలకు పెళ్లి జరిగింది. శర్వానంద్ పెళ్లికి పలువురు సినీ ప్రముఖులు, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు.
రాజస్థాన్లోని జైపుర్లో ఉన్న లీలా ప్యాలెస్ వేదికగా రెండు రోజులపాటు ఈ వేడుకలు జరిగాయి. ఈ వేడుకకు కేవలం కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితులు మాత్రమే హాజరైనట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన కొన్ని ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. శర్వానంద్ పెళ్లి వేడుకల్లో రామ్ చరణ్ దంపతులు సందడి చేసిన వీడియోలు నెట్టింట్లో గింగిరాలు తిరిగాయి. వీరితో పాటు పలువురు రాజకీయ ప్రముఖులు సైతం హాజరై నూతన వధూవరులైన శర్వానంద్-రక్షిత్ రెడ్డిలను ఆశీర్వదించారు.
ఈ వేడుకల్లో శర్వానంద్-రక్షిత పెళ్లి వస్త్రాల్లో చూడముచ్చటగా దర్శనం ఇచ్చారు. శర్వానంద్ పింక్ కలర్ షేర్వానీ ధరిస్తే.. రక్షిత సిల్వర్ క్రీమ్ కలర్ చీరతో కనువిందు చేశారు.ఇక శర్వానంద్-రక్షిత రెడ్డిల రిసెప్షన్ కు ఏర్పాట్లు జరుగుతున్నట్లు తెలుస్తోంది. శర్వానంద్ రిసెప్షన్ పార్టీని జూన్ 9న హైదరాబాద్ లో నిర్వహించున్నానరని సమాచారం. ఇదిలా ఉంటే సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా వర్క్ చేస్తున్న రక్షిత రెడ్డిని శర్వానంద్ ప్రేమించి, తర్వాత పెళ్లికి పెద్దలను ఒప్పించాడని చాలా రోజులుగా టాక్ నడుస్తోన్న విషయం తెలిసిందే.