Thodelu Review : ఈ మధ్య బాలీవుడ్ చూపంతా సౌత్ ఇండియన్ సినిమాలపై పడింది. ఇక్కడి సినిమాలు అక్కడ రీమేక్ చేయడమే కాదు అక్కడి సినిమాలను ఇక్కడ డబ్ చేసి మరీ రిలీజ్ చేస్తున్నారు. తెలుగు ప్రేక్షకుల మనసు దోచేయాలని బీ టౌన్ నటులు తెగ తాపత్రయపడుతున్నారు. చిన్నా పెద్దా లేకుండా అన్ని హిందీ సినిమాలను ఇక్కడ డబ్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఇక టాలీవుడ్ ప్రొడ్యూసర్లు కూడా తెలుగు ప్రేక్షకుల నాడి పట్టడం బాగా తెలిసి వారికి నచ్చుతాయనిపించిన సినిమాలను ఇక్కడ డబ్ చేసి విడుదల చేస్తున్నారు. అలా విడుదలైన సినిమాయే తోడేలు. హిందీలో భేడియాగా తెరకెక్కించిన ఈ సినిమాను తోడేలు పేరుతో అల్లు అరవింద్ తెలుగులో రిలీజ్ చేశారు. మరి ఈ డబ్బింగ్ సినిమా తెలుగు ప్రేక్షకుల మనసు గెలిచిందా లేదా చూద్దాం. Thodelu Telugu Cinema Review / తోడేలు Review
రేటింగ్ : 2.75/5
స్టోరీ ఏంటంటే..? భాస్కర్(వరుణ్ ధావన్) చిన్నపాటి కాంట్రాక్టర్. అరుణాచల్ ప్రదేశ్ లోని ఒక అటవీ ప్రాంతంలో రోడ్డు వేసే కాంట్రాక్టు దక్కించుకుంటాడు. ఈ కాంట్రాక్ట్ ద్వారా బాగా డబ్బులు సంపాదించి సొంతంగా ఇల్లు, కారు కొనుకుని లైఫ్‌లో సెటిల్ కావాలనుకుంటాడు. రోడ్డు నిర్మాణం కోసం అరుణాచల్ ప్రదేశ్‌కి తన స్నేహితుల(దీపక్ దోబ్రియా, పాలిన్ బకర్)తో కలిసి బయలు దేరుతాడు. అడవి మధ్యలో నుంచి రోడ్డు వేయాలనుకుంటాడు. లోకల్ అధికారులు అందుకు నో చెప్పగా, కమీషన్ ఎర చూపిస్తాడు. ఈ క్రమంలోనే భాస్కర్ ఓ రాత్రి తోడేలు కాటుకు గురవుతాడు. అప్పటి నుంచి ప్రతి రాత్రి భాస్కర్ తోడేలుగా మారిపోతుంటాడు. తోడేలుగా మారడమే కాదు రోజుకి ఒక్కరిని చంపి తింటూ ఉంటాడు. అడవిని నాశనం చేయాలనుకున్న వారిని, అందుకు సంబంధించి అవినీతికి పాల్పడిన వారిని చంపేస్తుంటాడు. ఈ క్రమంలో అతణ్ని మామూలు మనిషి చేసేందుకు అక్కడ వెటర్నరీ డాక్టర్ అనిక(కృతిసనన్) సాయం చేస్తుంది. మరి భాస్కర్ మళ్లీ మామూలు మనిషి అయ్యాడా? ఇంతకీ డాక్టర్ అనిక ఎవరు? వాళ్ల ప్రేమ కథేంటి? ఆ తోడేలు కథేంటి? ఈ సినిమాను ప్రకృతికని ముడిపెట్టే అంశమేంటి అనేది అసలు కథ.
మూవీ ఎలా ఉందంటే..? ప్రకృతి(అడవి)ని విధ్వంసం చేస్తే అది ప్రతీకారం తీర్చుకుంటుందని, అందుకు కారకులైన మనుషులను అంతం చేస్తుందనే సందేశంతో రూపొందించిన చిత్రమిది. ప్రకృతిని కాపాడేందుకు తోడేలు బాధ్యత తీసుకోవడం ఇక్కడ ఆకట్టుకునే అంశం. ఆ సందేశాన్ని ఎంతో ఎంటర్‌టైనింగ్‌గా చెప్పే ప్రయత్నం బాగుంది. అరుణాచల్ ప్రదేశ్ అడవుల్లో తోడేలు విన్యాసాలు, హీరో తోడేలుతో పడే బాధలు ఆకట్టుకునేలా తీర్చిదిద్దారు. మనిషి మనుగడకి ప్రధాన కారకమైన అడవులను కాపాడాలనే కాన్సెప్ట్ తో చాలా సినిమాలు వచ్చినా, మనకు ఇలాంటి కాన్సెప్ట్ మాత్రం కొత్తదనే చెప్పాలి. హాలీవుడ్లో ఇలాంటి సినిమాలు చాలానే వచ్చాయి.
ప్రకృతిని కాపాడేందుకు ఇందులో మనిషి తోడేలుగా మారి అవినీతి పరులను, ప్రకృతికి హాని కలిగించే వారిని అంతం చేయడమనేది ఆసక్తికర అంశం. దీనికి హీరో ఫ్రెండ్స్ తో కామెడీగా కథని నడిపించిన తీరు బాగుంది. చివరిలో హీరోయిన్‌తో వచ్చే ట్విస్ట్.. హీరోహీరోయిన్స్ క్లైమాక్స్ ఫైట్ గూస్బమ్స్ తెప్పిస్తాయి. కథ పరంగా, క్లైమాక్స్, ట్విస్టులు ఆకట్టుకున్నా, సినిమా నడిచిన తీరు కాస్త బోరింగ్ అనిపిస్తుంది. మనిషి తోడేలుగా మారినప్పుడు అతడిలో సంఘర్షణ, మామూలు మనిషి జీవితం కోల్పోతున్నానన్న భావన, ఆ ఎమోషన్స్ పండించడంలో డైరెక్టర్ కాస్త తడబడినట్లు అనిపిస్తుంది. చిన్న పిల్లలు మాత్రం ఈ మూవీని బాగా ఎంజాయ్ చేస్తారు. గ్రాఫిక్స్, సౌండ్ ఎఫెక్ట్స్ ఈ సినిమాకి మరో స్పెషల్ ఎట్రాక్షన్స్.
యాక్టింగ్ ఎలా చేశారంటే..? భాస్కర్ పాత్రలో వరుణ్ ధావన్ అద్బుతంగా చేశాడు. పాత్రలో పరకాయప్రవేశం చేశాడు. తెలుగు ప్రేక్షకులకు తమకు తెలియని నటుడు అనే ఫీలింగే రాకుండా చేశాడు. మనిషి నుంచి తోడేలుగా మారే సన్నివేశాలు, కామెడీ సన్నివేశాల్లో ఇరగదీశాడు. సినిమాను తన భుజాలపై మోశాడు. వెటర్నరీ డాక్టర్ గా కృతి సనన్ ఆకట్టుకుంది. ఆమె పాత్రలో ట్విస్ట్ సినిమాకు సర్‌ప్రైజింగ్ ఎలిమెంట్. వరుణ్ ధావన్ స్నేహితులుగా దీపక్, పాలిన్ బాగా చేశారు. నవ్వులు పూయించారు. డైరెక్టర్ అమర్ కౌశిక్ మంచి పాయింట్‌తో సినిమాను తెరకెక్కించారు. తాను అనుకున్న పాయింట్‌ను అనుకున్నట్లుగా తెరకెక్కించడంలో అమర్ సక్సెస్ అయ్యాడని చెప్పొచ్చు. కానీ సినిమాలో కాస్త ఎమోషన్ క్రియేట్ చేసుంటే టాలీవుడ్ ప్రేక్షకులను ఇంకా ఎక్కువగా ఆకట్టుకునేది. సీరియస్ స్టోరీలోనూ కామెడీ పండించడం.. అది కూడా ఏదో ఇరికించినట్టు కాకుండా ఆ సీన్లో భాగంగానే ఉండేలా జాగ్రత్తపడటం సినిమాకు ప్లస్ పాయింట్.
చిత్రం : తోడేలు; నటీనటులు : వరుణ్ ధావన్, కృతి సనన్, దీపక్ డొబ్రియాల్, అభిషేక్ బెనర్జీ, సౌరభ్ శుక్లా ; డైరెక్టర్ : అమర్ కౌశిక్ ; నిర్మాత : దినేశ్ విజన్ ; బ్యానర్ : మ్యాడ్‌డాక్ ఫిలిమ్స్ ; తెలుగు డిస్ట్రిబ్యూటర్ : అల్లు అరవింద్
కన్‌క్లూజన్ : విజువల్ ట్రీట్‌తో వేటాడేసిన తోడేలు.. ఇండియన్ సినిమాలో ఇదో ప్రయోగం