Waltair Veerayya and Veeerasimha redddy : ‘వీరసింహారెడ్డి’, ‘వాల్తేరు వీరయ్య’ సినిమాల్లో ఉన్న కామన్‌ పాయింట్స్‌ ఇవే!

- Advertisement -

Waltair Veerayya and Veeerasimha redddy : సంక్రాంతి బరిలో పందెం కోళ్లుగా మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ దిగుతున్నారు. వీరసింహారెడ్డి సినిమాతో జనవరి 12న బాలయ్య వస్తుండగా.. వాల్తేరు వీరయ్య మూవీతో జనవరి 13న చిరంజీవి సందడి చేయనున్నారు. ఈ ఇద్దరు స్టార్ హీరోలు ప్రస్తుతం తమ సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు. ఇప్పటికే ఈ సినిమాలకు సంబంధించి ట్రైలర్, పాటలు విడుదలై ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తున్నాయి.

Waltair Veerayya and Veeerasimharedddy
Waltair Veerayya and Veeerasimharedddy

ఒకరేమో గాడ్ ఆఫ్ మాసెస్ అంటూ వస్తోంటే.. మరొకరేమో పూనకాలు లోడింగ్ అంటూ ఆడియెన్స్ లో జోష్ నింపుతున్నారు. ఇప్పటికే చాలా సార్లు చిరు, బాలయ్య సంక్రాంతి బరిలో పోటీపడ్డారు. ఈ ఇద్దరు తలపడబోతున్నారన్న ప్రతిసారి వారి అభిమానులు, ప్రేక్షకుల్లో అమితాసక్తి నెలకొంటుంది. ఈసారి హీరోల ఫ్యాన్సే సినిమాలు డైరెక్ట్ చేయడంతో ఈ మూవీస్ పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఆ ఇద్దరు ఫ్యాన్స్‌ సినిమాల కథలు, సినిమాల్లో ఉన్న కామన్‌ పాయింట్స్ ఏంటంటే?

అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా తన సినీ ప్రస్థానం మొదలుపెట్టిన గోపీచంద్‌ మలినేని ‘డాన్‌శీను’తో దర్శకుడిగా మారారు. తొలి ప్రయత్నంలోనే ప్రేక్షకులను మెప్పించిన ఆయన ఆ తర్వాత ‘బాడీగార్డ్‌’, ‘బలుపు’, ‘పండగ చేస్కో’, ‘విన్నర్’, ‘క్రాక్‌’ సినిమాలను తెరకెక్కించారు. 2010లో డైరెక్టర్‌గా ప్రయాణం ప్రారంభించిన ఆయనకు దాదాపు 12 సంవత్సరాల తర్వాత ఫేవరెట్‌ యాక్టర్‌ బాలకృష్ణతో సినిమా తీసే అవకాశం లభించింది. అదే ‘వీరసింహారెడ్డి’.

- Advertisement -

1999లో విడుదలైన బాలకృష్ణ సినిమా ‘సమరసింహారెడ్డి’ మార్నింగ్‌, మ్యాట్నీ షో మిస్‌ అయినందుకు ఎంతో బాధపడ్డ ఫ్యాన్‌.. అదే హీరోతో సినిమా తీసే అవకాశం వస్తే? ఏం చేస్తాడో గోపీచంద్‌ అదే చేశారని బాలయ్య లుక్స్‌, ప్రచార చిత్రాలు చెప్పకనే చెబుతున్నాయి. సినిమా షూటింగ్ సమయంలో ఓ కంటితో అభిమానిగా, మరో కంటితో దర్శకుడిగా బాలయ్యను చూశానని ‘వీరసింహారెడ్డి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో గోపీచంద్‌ తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. తన అభిమాని అయిన గోపీచంద్‌తో గొప్ప సినిమా చేయడం గర్వంగా ఉందని బాలకృష్ణ అదే వేడుకలో తెలిపారు.

Balakrishna and Chiranjeevi
Balakrishna and Chiranjeevi

మరో దర్శకుడు కె. బాబీ.. చిరంజీవికి పెద్ద అభిమాని. ‘ఇంద్ర’ సినిమా ప్రభావం తనపై ఎక్కువగా ఉండడంతో హైదరాబాద్‌కు వచ్చేసిన బాబీ ఆ చిత్ర రచయిత చిన్నికృష్ణ దగ్గర కొంతకాలం పనిచేశారు. ఓసారి రక్తదానం చేసేందుకు గీతా ఆర్ట్స్‌ ఆఫీసుకు వెళ్లగా తానప్పటికి బలహీనంగా ఉండడంతో బాబీని తిరస్కరించారు. అదే సమయంలో అక్కడికి వచ్చిన చిరంజీవితో బాబీ ఫొటో దిగారు. అయితే, ఆ ఫొటోలో చిరు సీరియస్‌గా చూస్తూ కనిపించారని, మళ్లీ ఆయనతో కలిసి ఫొటో దిగాలనిపించేదని ‘వాల్తేరు వీరయ్య’ మీట్‌లో బాబీ వివరించారు. ఆ మాటవినగానే కుర్చీలోంచి లేచి బాబీకు ముద్దిస్తూ చిరు ఫొటోలకు పోజిచ్చారు.

‘నా అభిమానికావడం వల్లే బాబీకి నేను అవకాశం ఇవ్వలేదు. కష్టపడి పనిచేసే అతని వ్యక్తిత్త్వం చూసి ఇచ్చా. ఆయనకు నేను అభిమానినయ్యా’ అని మరో వేడుకలో వెల్లడించారు. దర్శకుడు మలినేని గోపీచంద్‌ తెరకెక్కించిన ‘డాన్‌ శీను’, ‘బాడీగార్డ్‌’సహా పలు చిత్రాలకు స్క్రీన్‌ప్లే రాసిన బాబీ ‘పవర్‌’తో 2014లో డైరెక్టర్‌ అయ్యారు. అనంతరం, ‘సర్దార్ గబ్బర్‌సింగ్‌’, ‘జై లవకుశ’, ‘వెంకీమామ’ తెరకెక్కించారు. తన ఫేవరెట్‌ స్టార్‌తో తీసిన ‘వాల్తేరు వీరయ్య’ జనవరి 13న ప్రేక్షకుల ముందుకురానుంది. ట్రైలర్‌తోనే అభిమానులకు ‘పూనకాలు’ తెప్పించిన ఈ చిరు ఫ్యాన్‌ కమ్‌ డైరెక్టర్‌ సినిమాను ఎలా తీశారో తెలియాలంటే కొన్ని రోజులు ఓపిక పట్టాల్సిందే.

ఒకే హీరోయిన్‌..

ఈ రెండు సినిమాల్లోనూ శ్రుతిహాసనే కథానాయిక. ‘వాల్తేరు వీరయ్య’ సరసన శ్రీదేవిగా, ‘వీరసింహారెడ్డి’లో ఈషా అనే పాత్రలో కనిపిస్తారు. రెండూ చలాకీ పాత్రలేనని పాటలు, ట్రైలర్లు చూస్తే అర్థమవుతోంది. ఒకే హీరోయిన్‌ నటించిన రెండు పెద్ద చిత్రాలు సంక్రాంతి సీజన్‌కు విడుదలవడం అరుదు.  ‘బలుపు’, ‘క్రాక్‌’ తర్వాత గోపీచంద్‌- శ్రుతి కాంబోలో తెరకెక్కిన మూడో చిత్రంగా ‘వీరసింహారెడ్డి’ నిలవనుంది. 

ఒకటే నిర్మాణ సంస్థ..

ఈ రెండు సినిమాలకు సంబంధించి మరో విశేషం ఏంటంటే.. నిర్మాణ సంస్థ. రెండింటినీ మైత్రీ మూవీ మేకర్స్‌ బ్యానర్‌పై నవీన్‌ యెర్నేని, యలమంచిలి రవి శంకర్‌లు నిర్మించారు. ‘వాల్తేరు వీరయ్య’కు సుమారు రూ. 140 కోట్లు, ‘వీరసింహారెడ్డి’కి దాదాపు రూ.110 కోట్ల బడ్జెట్‌ పెట్టారు. ఒకే నిర్మాణ సంస్థలో రూపొందిన రెండు సినిమాలు ఒకేసారి ప్రేక్షకుల ముందుకు వస్తుండడం, పైగా సంక్రాంతి బరిలో నిలవబోతుండడం టాలీవుడ్‌లో ఇదే ప్రథమం. ఈ బ్యానర్‌లో చిరు, బాలయ్య నటించడం ఇదే తొలిసారి.

పాటలు.. మెరుపులు

రెండు చిత్రాల్లోనూ హీరో క్యారెక్టర్‌ను ఎలివేట్‌ చేసే పాట (జై బాలయ్య.. జై బాలయ్య, వాల్తేరు వీరయ్యలో వీరయ్య), ఐటెమ్‌ సాంగ్‌ (మా బావ మనోభావాలు, బాస్‌ పార్టీ) కామన్‌. ‘మా బావ మనోభావాలు’ (వీరసింహారెడ్డి)లో ఆస్ట్రేలియన్‌ నటి చంద్రికా రవి .. బాలకృష్ణతో కలిసి స్టెప్పులేశారు. అదే పాటలో హనీరోజ్‌ కూడా కనిపిస్తారు. చిరంజీవి, బాలీవుడ్‌ నటి ఊర్వశీ రౌతేలా (Urvashi Rautela) కలిసి డ్యాన్స్‌ చేసిన స్పెషల్‌ సాంగే ‘బాస్‌ పార్టీ’ (వాల్తేరు వీరయ్య). వీటితోపాటు మెలొడీ, హుషారైన గీతాలు రెండింటిలోనూ ఉన్నాయి.

‘వీరసింహారెడ్డి’కి  ముందు బాలకృష్ణతో కలిసి సంగీత దర్శకుడు తమన్‌ ‘డిక్టేటర్‌’, ‘అఖండ’ చిత్రాలకు పనిచేశారు. ‘వాల్తేరు వీరయ్య’కు ముందు చిరంజీవి- మ్యూజిక్‌ డైరెక్టర్‌ దేవిశ్రీ ప్రసాద్‌ కాంబినేషన్‌లో ‘శంకర్‌దాదా: ఎంబీబీఎస్‌’, ‘శంకర్‌దాదా: జిందాబాద్‌’, ‘అందరివాడు’, ‘ఖైదీ నంబర్‌. 150’ చిత్రాలొచ్చాయి.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here