Varalakshmi sharatkumar : తెలుగు సినీ పరిశ్రమలో లేడీ విలన్ అనగానే మనకు గుర్తొచ్చేది పాత సినిమాల్లో సూర్యకాంతం.. ఆ తర్వాత తరంలో పవర్‌ఫుల్ లేడీ రమ్యకృష్ణ. ‘నరసింహా’, ‘నీలాంబరి’ చిత్రాల్లో ప్రతినాయికగా, హీరోకు సమానంగా ఆమె నటించిన తీరు అందర్నీ కట్టిపడేసింది. ఆ పాత్రల్లో ఆమె రాజసం, అహంకారం ముఖంలోనే కనిపిస్తుంది. హీరోకు దీటుగా ఆమె నటన ఉంటుంది. తెలుగు చిత్రపరిశ్రమలో ఇప్పటికీ లేడీ విలన్ అంటే గుర్తొచ్చే పేరు రమ్యకృష్ణయే. అంతలా టాలీవుడ్‌పై ముద్ర వేసింది ఈ హీరోయిన్.

ఇప్పుడు జనరేషన్ మారింది. ఇండస్ట్రీకి కొత్తనీరు వస్తోంది. ఇతర భాషల నుంచి హీరోయిన్లు, క్యారెక్టర్ ఆర్టిస్టులే కాదు లేడీ విలన్లను తెచ్చుకుంటున్నాం. కానీ రమ్యకృష్ణలా మాత్రం ఎవరూ తమ పవర్ చూపించడం లేదు. హీరోయిన్లుగా ముద్ర వేస్తున్నారు కానీ విలన్ స్థానానికి వచ్చేసరికి మాత్రం తేలిపోతున్నారు. కొందరు వ్యాంప్ పాత్రలకే పరిమితమైపోతున్నారు. నేటి జనరేషన్‌లో లేడీ విలన్‌గా రమ్యకృష్ణ స్థానాన్ని భర్తీ చేయడానికి ఓ నటి వచ్చిందని టాలీవుడ్ మాట్లాడుకుంటోంది. రమ్యకృష్ణలా మరో భామ తన సత్తా చూపిస్తోందని నెటిజన్లు అంటున్నారు. ఇంతకీ అంతటి పవర్ ఫుల్ లేడీ విలన్ ఎవరో తెలుసా..?
ఇంకెవరు వరలక్ష్మి శరత్‌కుమార్. పేరు విన్న తర్వాత మీరు కూడా అవును.. నిజమే కదా అనుకుంటున్నారు. కదా.. ఈ తరం నటుల్లో రమ్యకృష్ణలా వర్సటాలిటీ ఉన్న నటి వరలక్ష్మీయే. కోలీవుడ్ నటుడు శరత్‌కుమార్ కుమార్తెగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈ భామ కెరీర్ ఆరంభంలో ఎన్నో సవాళ్లు ఎదుర్కొని.. గ్లామర్‌తోపాటు నెగిటివ్ షేడ్స్ ఉన్న రోల్స్‌నూ నటించింది. ‘పందెంకోడి-2’, ‘సర్కార్’, ‘మారి 2’ చిత్రాలు ఆమె కెరీర్‌నే మార్చేశాయి.

ముఖ్యంగా విశాల్ హీరోగా నటించిన ‘పందెంకోడి-2’లో వరలక్ష్మి.. ప్రతినాయిక పాత్రలో అక్కడి వారిని అలరించింది. దీంతో తమిళంలో ఆమెకు మంచి పేరు వచ్చింది. ‘పందెంకోడి’లో వరలక్ష్మి నటనకు ఫిదా అయిన తెలుగు దర్శకుడు నాగేశ్వర రెడ్డి ఆమెకు టాలీవుడ్‌లో మొదటి అవకాశాన్ని ఇచ్చారు. ఆయన తెరకెక్కించిన ‘తెనాలి రామకృష్ణ బీఏబీఎల్’లో ఆమె పూర్తిస్థాయి విలన్‌గా రాణించింది. ఈ సినిమా మిశ్రమ స్పందనలకే పరిమితమైనప్పటికీ వరూ రోల్‌కు మాత్రం పాజిటివ్ రివ్యూలే వచ్చాయి.
వరలక్ష్మికి తెలుగులో స్టార్ ఇమేజ్ అందించిన చిత్రం ‘క్రాక్’. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రవితేజ హీరోగా నటించిన ఈ చిత్రంలో ఆమె జయమ్మగా నటించింది. విలన్‌కు (సముద్రఖని) సపోర్ట్‌గా ఉంటూ.. అతడి ఎదుగుదలకు కారణమై.. చివరికి అతడి చేతిలోనే ప్రాణాలు వదిలే పాత్రలో ఆమె పలికించిన హావభావాలు తెలుగువారిని మెప్పించాయి. ముఖ్యంగా ఆమె బేస్ వాయిస్ ఈ పాత్రకు హైలైట్‌గా నిలిచింది.
సమంత ప్రధాన పాత్రలో నటించిన యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘యశోద’. సరోగసి నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో వరలక్ష్మి విలన్‌గా నటించింది. మంత్రి భార్యగా.. ఓ ఆస్పత్రికి యజమానిగా సినిమా ఆరంభంలో కనిపించిన ఆమె ప్రీ క్లైమాక్స్‌కు వచ్చేసరికి విలన్‌గా తన నటనతో ఆకట్టుకుంటుంది. ఈ సినిమాలో వరలక్ష్మి పాత్రను బయట జనాలు బాగా తిట్టుకున్నారంటే.. ఆమె ఆ పాత్రతో ఎంతగా మెప్పించిందో అర్థం చేసుకోవచ్చు.
ఇక లేటెస్ట్‌గా.. సంక్రాంతి కానుకగా విడుదలైన ‘వీర సింహారెడ్డి’ వరలక్ష్మికి తెలుగులో మరో హిట్ ఇచ్చింది. ఇందులో ఆమె భానుమతి పాత్రలో బాలయ్యకు సోదరిగా నటించింది. ఇష్టమైన వ్యక్తికి దూరమై.. అన్నయ్యపై పగ తీర్చుకునే రోల్‌లో ఆమె నటన అందర్నీ కట్టిపడేసింది. సీమ యాసలో ఆమె చెప్పే పవర్‌ఫుల్ సంభాషణలు సినీ ప్రియులను ఆకట్టుకుంటున్నాయి. ఈసినిమా విడుదలయ్యాక.. ఇందులో ఆమె నటన చూసి టాలీవుడ్ ఇండస్ట్రీకి మరో లేడీ విలన్ వచ్చేసిందంటూ వరుస కామెంట్స్ చేస్తున్నారు.