Sharwanand : ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న తరుణం రానే వచ్చింది. నిజమా.. అబద్ధమా అని సందిగ్ధంలో ఉన్న అభిమానులకు ఎట్టకేలకు క్లారిటీ వచ్చింది. నిజమే.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్.. యంగ్ హీరో.. శర్వానంద్ ఓ ఇంటివాడు కాబోతున్నాడు.

ఇన్ని రోజుల నుంచి వస్తున్న వార్తలకు చివరకు చెక్ పెట్టాడు శర్వా. తన ఎంగేజ్మెంట్ ఫొటోలతో ఫ్యాన్స్‌కు షాకింగ్ సర్ప్రైజ్ ఇచ్చాడు.

హీరో శర్వానంద్ త్వరలో తన సింగిల్ లైఫ్‌కు ఫుల్‌స్టాప్ పెట్టనున్నాడు. రక్షితా రెడ్డితో ఆయన ఏడడుగుల బంధంలోకి అడుగుపెట్టనున్నాడు. తాజాగా ఈ జంటకు నిశ్చితార్థం జరిగింది. ఇరు కుటుంబసభ్యుల సమక్షంలో గురువారం ఉదయం హైదరాబాద్‌లోని ఓ హోటల్‌లో జరిగింది.

కేవలం బంధు మిత్రుల సమక్షంలోనే జరిగిన ఈ వేడుకకు శర్వానంద్ ప్రాణ మిత్రుడు రామ్‌చరణ్, ఆయన సతీమణి ఉపాసన పాల్గొన్నారు. కాబోయే వధూవరులకు శుభాకాంక్షలు తెలిపారు. దీనికి సంబంధించిన ఓ ఫొటో నెట్టింట వైరల్‌గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు.. కొత్త జంటకు విషెస్ చెబుతున్నారు.

ఇక శర్వానంద్ పెళ్లి చేసుకోబోయే రక్షితా రెడ్డి సాఫ్ట్ వేర్ ఉద్యోగిని. రక్షిత తండ్రి మధుసూదన రెడ్డి హైకోర్టు లాయర్. టీడీపీ నేత బొజ్జల గోపాల కృష్ణారెడ్డి అల్లుడు గంగారెడ్డికి మేనకోడలు అవుతుందని సమాచారం.

మొదట చిన్న పాత్రలతో సిల్వర్ స్క్రీన్‌పై మెరిసిన శర్వానంద్.. ఆ తర్వాత హీరోగా సినీ ఇండస్ట్రీలో పదిహేనేళ్లకు పైగా సక్సెస్‌ఫుల్ కెరీర్‌ను కొనసాగిస్తున్నాడు. కొత్తదనంతో కూడిన కథలను ఎంపిక చేసుకుంటూ సక్సెస్, ఫెయిల్యూర్‌తో సంబంధం లేకుండా సినిమాలు చేస్తూ.. ముందుకెళ్తున్నాడు శర్వానంద్.

ఇటీవల ‘ఒకే ఒక జీవితం’ సినిమాతో చాలా రోజుల తర్వాత శర్వా ఓ హిట్ కొట్టాడు. ఆ మూవీ తర్వాత దర్శకుడు శోభన్ కుమారుడు సంతోష్ శోభన్ నటించిన `కళ్యాణం కమనీయం` చిత్రంలో పూర్తిగా పెళ్లిని వ్యతిరేకించేవాడిగా అతిథి పాత్రతో అలరించనున్నాడు.

ఇటీవల రిలీజ్ అయిన ఈ సినిమా ప్రోమో ఆకట్టుకుంది. మరోవైపు ‘ఒకే ఒక జీవితం’ విజయం తర్వాత శర్వానంద్ నుంచి కొత్త ప్రాజెక్ట్‌లకు సంబంధించిన అప్‌డేట్‌లు ఏమీ బయటకు రాలేదు. పెళ్లి పనుల్లో బిజీగా ఉండటంతోనే ఆయన కొంత విరామం తీసుకున్నారని.. త్వరలోనే కొత్త సినిమాల గురించి ప్రకటిస్తారని సమాచారం.