RRR Movie : దర్శకుడు రాజమౌళి తెరకెక్కించిన ‘ఆర్‌ఆర్‌ఆర్’ సినిమాకు ఇంకా అవార్డుల పంట పండుతూనే ఉంది. ఇక ఈ సినిమాకు జాతీయ స్థాయిలోనే కాదు ఇప్పటికే పలు అంతర్జాతీయ పురస్కారాలు కూడా వచ్చాయి. హాలీవుడ్‌లోనూ ఈ మూవీ హవా ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇండియన్ ప్రేక్షకులే కాదు ఈ చిత్రానికి విదేశీ ప్రేక్షకులు కూడా ఫిదా అయ్యారు.
ఆర్ఆర్ఆర్ చిత్రానికి తాజాగా మరో అరుదైన గౌరవం దక్కింది. ఇటీవలే ఈ సినిమాలోని ‘నాటు నాటు’ పాటకు గోల్డెన్ గ్లోబ్ సహా క్రిటిక్స్ ఛాయిస్ అవార్డ్స్‌లో బెస్ట్ ఫారెన్ లాంగ్వేజ్ చిత్రం, నాటు నాటుకు బెస్ట్ సాంగ్స్.. రెండు పురస్కారాలు దక్కిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు తాజాగా 46వ జపాన్ అకాడమీ ఫిల్మ్ ప్రైజ్‌కు సంబంధించి ‘అవుట్ స్టాండింగ్ ఫారిన్ ఫిల్మ్’ విభాగంలో అవార్డు సాధించింది. ‘అవతార్’, ‘టాప్‌గన్: మ్యావరిక్’ వంటి హాలీవుడ్ చిత్రాలను దాటి ‘ఆర్‌ఆర్‌ఆర్’ ఈ జపాన్ పురస్కారాన్ని ముద్దాడం విశేషం.
దీంతో ఈ పురస్కారం అందడంపై అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మూవీటీమ్‌కు అభినందనలు తెలియజేస్తున్నారు. అలాగే ఆస్కార్ సాధించాలని కోరుకుంటున్నారు. ఇకపోతే ఈ సినిమా ‘ఆస్కార్’ బరిలో నిలిచిన సంగతి తెలిసిందే. బెస్ట్ ఒరిజినల్ స్కోర్ విభాగంలో నాటు నాటు పాట నామినేషన్స్‌కు షార్ట్ లిస్ట్ అయింది. ఇకపోతే ఈ మూవీ.. ఉత్తమ చిత్రం, ఉత్తమ నటుడు, ఉత్తమ దర్శకుడు విభాగాల్లోనూ ఆస్కార్ కోసం పోటీ పడుతుంది. మరి కొన్ని గంటల్లో నామినేషన్స్ ఫైనల్ లిస్ట్ రానుంది.
కాగా, ఎన్టీఆర్, రామ్‌చరణ్ హీరోలుగా రూపొందిన ఆర్‌ఆర్‌ఆర్ చిత్రానికి రాజమౌళి దర్శకత్వం వహించగా, డీవీవీ దానయ్య నిర్మించారు. అలియాభట్, అజయ్ దేవగన్, శ్రియా, ఒలివియా మోర్రీస్ ముఖ్య పాత్రలు పోషించారు. ఈ సినిమా గతేడాది మార్చి 25న ప్రపంచ వ్యాప్తంగా విడుదలై భారీ విజయాన్ని సాధించింది. ఏకంగా రూ.1200కోట్లు వసూలు చేసింది. ఇప్పుడు ఇతర దేశాల్లోనూ మంచి వసూళ్లతో దూసుకెళ్తోంది.
మరోవైపు ఈ సినిమాతో డైరెక్టర్ రాజమౌళి పేరు బాలీవుడ్‌లోనే కాదు హాలీవుడ్‌లోనూ మార్మోగిపోతోంది. హాలీవుడ్ ప్రముఖ దర్శకుడు జేమ్స్ కామెరూన్, భారతీయ దర్శకధీరుడు రాజమౌళి ఇటీవల ఓ కార్యక్రమంలో కలిసిన విషయం తెలిసిందే. ఆర్‌ఆర్‌ఆర్ గురించి వీరిద్దరూ చాలా సేపు మాట్లాడుకున్నారు. ఈ సినిమా తనకెంతో నచ్చిందంటూ ఇందులోని పలు సీన్లను కామెరూన్.. జక్కన్నకు తెలియజేశారు. ఈ చిత్రాన్ని కామెరూన్ రెండుసార్లు చూసినట్లు ఆయన సతీమణి సుజీ కామెరూన్ వెల్లడించారు.
వీరిద్దరి మాటలతో రాజమౌళి అమితానందం పొందారు. ఈ మొత్తం సంభాషణకు సంబంధించిన ఓ స్పెషల్ వీడియోను ఆర్‌ఆర్‌ఆర్ టీమ్ శనివారం విడుదల చేసింది. అంతే కాకుండా..రాజమౌళికి జేమ్స్ కామెరూన్ అదిరిపోయే ఆఫర్ ఇచ్చారు. ఆర్‌ఆర్‌ఆర్ చూసి ఫిదా అయిన ఆయన భవిష్యత్తులో ఎప్పుడైనా జక్కన్నకు హాలీవుడ్‌లో సినిమా చేసే ఉద్దేశం ఉంటే తనని సంప్రదించాలని కోరారు.
మరోవైపు ఆర్‌ఆర్‌ఆర్ చిత్రం భారతదేశం తరఫున ఆస్కార్‌కు అధికారికంగా ఎంట్రీ సాధించకపోవడంపై తాను బాధపడ్డానని జక్కన్న అన్నారు. “దేశం తరఫు నుంచి అధికారికంగా ఎంట్రీ సాధించకపోవడం వల్ల నిరాశ చెందాను. అయితే ఎంట్రీ ఎందుకు సాధించలేకపోయాం అంటూ ఆలోచించే వ్యక్తిని కాదు. మనం ముందుకు సాగిపోవాలి.
మన దేశం నుంచి లాస్ట్ ఫిల్మ్ షో ఆస్కార్ షార్ట్‌లిస్ట్‌లో స్థానం దక్కించుకున్నందుకు సంతోషిస్తన్నా. ఆర్‌ఆర్‌ఆర్ అధికారికంగా ఎంట్రీ ఇస్తే బాగుంటుందని విదేశీయులు కూడా అనుకుంటున్నారు. కానీ, ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఎలా ఉంటుంది? దాని నియమ నిబంధనలు ఏమిటి? అనేది నాకు తెలియదు. కాబట్టి దాని గురించి నేను కామెంట్ చేయాలనుకోవడం లేదు” అని జక్కన్న వివరించారు.